UP Farmers: దుక్కి దున్నింది మొదలు పంట చేతికి వచ్చే మార్కెట్ కు వెళ్లి డబ్బు చేతిలో పడే వరకూ రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. కల్తీ విత్తనాలు, వర్షాలు లేకపోవడం లేదంటే పంట కొట్టుకుపోయేలా కురవడం, పంటకు పురుగు ఆశించడం, ఎరువుల ధరలు పెరగడం, పంట కోతలో ఇబ్బందులు, మార్కెట్ల మాయాజాలం, దళారుల దోపిడీ ఇలా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటే గానీ రైతు చేతికి పంట డబ్బులు రావు. ఆరుగాలం శ్రమిస్తే గానీ బుక్కెడు బువ్వ దొరకదు. కల్తీ విత్తనాలను దాటుకుని, పురుగు ఆశించకుండా కాపాడుకుంటూ పంట మంచి దిగుబడి వచ్చేలా కష్టపడితే.. పందులు, కోతులు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరి ప్రాంత రైతులు చూపిన పరిష్కారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 






కోతుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ ఖేరి రైతులు వినూత్న ఆలోచన చేశారు. కోతులు పంటను నాశనం చేస్తున్నాయని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలని లఖింపుర్ ఖేరి రైతులు ఎన్నో సార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. కానీ ఎప్పట్లాగే వారి నుంచి ఎలాంటి సాయం అందలేదు. పంట ఏపుగా పెరిగింది, దిగుబడి చక్కగా వస్తుందని సంబరపడే లోపే కోతులు వచ్చి పంటను నాశనం చేస్తూ అవస్థల పాలు చేస్తున్నాయి. ఈ సమస్యతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు వారే ఓ పరిష్కారం కనుగొన్నారు. అవసరం ఆవిష్కరణకు కన్న తల్లి వంటిది అనే నానుడిని నిజం చేస్తూ.. లఖింపుర్ ఖేరి రైతులు చేసిన ఆలోచన ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది. 


లఖింపుర్ ఖేరిలోని జహాన్ నగర్ గ్రామానికి చెందిన రైతులు స్వయంగా ఎలుగుబంటి దుస్తులు కొనుగోలు చేశారు. ఆ ఎలుగు బంటి దుస్తులు ధరించి పొలాల్లో కూర్చుంటున్నారు. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో వస్తున్న కోతులు పంటను నాశనం చేస్తుండటంతో ఈ ఆలోచన చేశామని స్థానిక రైతులు చెబుతున్నారు. ఇలా ఎలుగుబంటి వేషం వేసుకుని పొలాల్లో కూర్చుంటే కోతులు భయపడి అటు వైపు రావడం లేదని అన్నదాతులు తెలిపారు. అయితే రైతుల కుటుంబంలో నుంచి రోజుకొకరి చొప్పున ఇలా వేషం వేసుకుని పొలాల్లో తిరుగుతున్నారు. రూ. 4 వేల రూపాయలు పెట్టిన కొన్న ఈ ఎలుగుబంటి దుస్తులతో మంచి ఫలితం వస్తోందని, కోతులు అటు వైపు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అని, అధికారులు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా ఎలుగుబంటి వేషం వేసుకుని పొలాల్లో కూర్చుంటే ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా కోతులు గుంపుగా వచ్చి దాడి చేసే ప్రమాదం ఉంటుందని స్థానికులు భయపడుతున్నారు. ఆలోపు అధికారులు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.