Monsoon News: దేశవ్యాప్తంగా నైరుతి విస్తరించింది. బిపర్‌జోయ్‌ తుపాను కారణంగా కాస్త ఆలస్యమైన రుతుపవనాలు తక్కువ వ్యవధిలోనే వ్యాపించాయి. ఇలా వ్యాపించే క్రమంలో ఓ అరుదైన ఘటన జరిగింది. 62 సంవత్సరాల తర్వాత ముంబయి, ఢిల్లీ నగరాలను నైరుతి రుతుపవనాలు ఒకేసారి తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబయిలో రెండు వారాలు ఆలస్యంగా, ఢిల్లీలో రెండు రోజుల ముందుగా నైరుతి రుతు పవనాలు ప్రవేశించడంతో ఈ పరిణామం చోటు చేసుకుందని ఐఎండీలో సీనియర్ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ వవరించారు. అలాగే 1961 జూన్ 21వ తేదీ తర్వాత ఇలా జరగడం ఇదే మొదటి సారి అని ప్రకటించారు.


రుతు పవనాల తాకిడితో వివిధ రాష్ట్రాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అసోంలో భీకరమైన వర్షం కురవగా.. ఆ రాష్ట్రం వరదల్లో చిక్కుకుంది. ప్రస్తుతం వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. అయినప్పటికీ వరదలకు ప్రభావితమైన వారి సంఖ్య 2 లక్షల 71 వేల 522కు దిగివచ్చింది. జాతీయ విపత్తు స్పందన దళం సిబ్బంది 123 మంది పౌరులను కాపాడారు.


ఆగమాగమైపోయిన ప్రజలు, పెంపుడు జంతువులు 


బజలి, బక్సా, బార్ పేట, బిస్వనాథ్, బొంగైగావ్, చిరాంగ్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, దిబ్రూగర్, గోల్పరా, గోలాఘట్, కమ్రూప్, కోక్రాఝర్, లఖింపూర్, నాగావ్, నల్బరి, తాముల్ పూర్, ఉడాలి జిల్లాలోని 54 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 1,538 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం జోర్హాట్ జిల్లాలోని నీమతిఘాట్ వద్ద, ధుబ్రి మానస్ నది, పగ్లాదియా నది, పుతిమరి నది వద్ద ప్రమాద స్థాయి మార్కును దాటి ప్రవహిస్తున్నాయి. అధికార యంత్రాంగం వరద ప్రభావిత జిల్లాల్లో 140 సహాయ శిబిరాలను, 756 సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సహాయక శిబిరాల్లో 35,142 మంది ఆశ్రయం పొందుతున్నారు. చాలా మంది రోడ్లు, ఎత్తైన ప్రాంతాలు, కట్టలపై ఆశ్రయం పొందినట్లు అధికారులు తెలిపారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ నివేదిక ప్రకారం 4,27,474 పెంపుడు జంతువులు కూడా వరదల వల్ల ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వరదల ప్రవాహానికి గత 24 గంటల్లో ఓ గట్టు తెగిపోయింది. మరో 14 ఇతర కట్టలు, 213 రోడ్లు, 14 వంతెనలు, అనేక పాఠశాలలు, నీటిపారుదల కాల్వలు, కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. 


బజలి జిల్లాలో 191 గ్రామాలకు చెందిన 2,67,253 మంది ప్రజలు ప్రభావితం అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 368.30 హెక్టార్ల పంట పొలాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. డోలోయ్ గావ్ శాంతిపూర్ గ్రామ ప్రాంతంలోని దాదాపు 200 కుటుంబాలు నదీ వరదతో ప్రభావితం అయ్యాయి. గ్రామస్థులు గట్ల వెంట, రహదారులపై తాత్కాలిక గుడారాలు వేసుకుని ఆశ్రయం పొందుతున్నారు. గ్రామంలోని 8-10 ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయని వరద బాధితులు చెబుతున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 


 అంతేకాకుండా ఛత్తీస్ గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. హర్యానాలోని పంచకులలో వంతెన కింద వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతున్న కారులో నుంచి ఓ మహిళను స్థానికులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాలు కురుస్తుండగా.. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధ కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసింది.