Wrestlers Protest: ఇకపై వీధి పోరాటాలు ఉండబోవని చెప్పేశారు రెజ్లర్లు. న్యాయ పోరాటం ద్వారానే తేల్చుకుంటామని ప్రకటించేశారు. రోడ్లపై ధర్నాలు, నిరాహార దీక్షలు చేయకుండా న్యాయస్థానాల నుంచే పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని మహిళా రెజ్లర్లు ప్రకటించారు. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించి, దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాన్ని తీసుకొచ్చారు రేజ్లర్లు. ఐదు నెలల పాటు వివిధ మార్గాల్లో పారాటం జరిగిన వారంతా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అయితే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చార్జిషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాలు ట్వీట్లు చేశారు.






"జూన్ 7వ తేదీన జరిగిన సమావేశంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు దిల్లీ పోలీసులు ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు పూర్తి చేసి జూన్ 15వ తేదీన ఛార్జిషీట్ దాఖలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కోర్టులో కొనసాగుతుందన్నారు. వీధుల్లో కాదు. మాకు హామీ ఇచ్చిన ప్రకారం.. జులై 11వ తేదీన జరగనున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ విషయంలో ప్రభుత్వం వాగ్దానాల అమలు కోసం వేచి చూస్తాం" అని రెజ్లర్లు ట్విట్టర్ పోస్టులు పెట్టారు. 










తనపై వచ్చిన అన్ని ఆరోపణలను బ్రిజ్ భూషణ్ సింగ్ తిరస్కరించారు. నేరం రుజువు అయితే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎంపీ బ్రిజ్ భూషణ్ పోలీసులకు సహకరిస్తూనే ఉంటారని, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆయన సహాయకుల్లో ఒకరు తెలిపారు. అయితే ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్ షిప్ సెలక్షన్ ట్రయల్స్ లో ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రస్తుతం నిరసన తెలుపుతున్న స్టార్ రెజ్లర్లు. తాము స్వతహాగా ట్రయల్స్ నుంచి మినహాయింపు కల్పించమని ఎవరినీ కోరలేదని.. ఒకవేళ అలా డిమాండ్ చేశామని నిరూపిస్తే పూర్తిగా రెజ్లింగ్ ఆట నుంచి తప్పుకుంటామని రెజ్లర్లు తేల్చి చెప్పారు.