Agra Taj Mahal Case:
ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌పై దాఖలైన పిటిషన్‌ను అల్‌హాబాద్ హైకోర్టు కొట్టేసింది. తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదులను తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను అల్‌హాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్ తోసిపుచ్చింది.
తాజ్‌మహల్ అసలు పేరు తాజ్‌మహల్ కాదని దాని పేరు 'తేజోమహల్' అంటూ అయోధ్యలో భాజపా మీడియా ఇన్ ఛార్జిగా ఉన్న డా.రజనీష్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజ్‌మహల్‌లోని ఆ 22 ఎందుకు రహస్యంగా ఉంచారో తెలుసుకోవాలని కోరారు. వాటిలో హిందూ విగ్రహాలు, చాలా శాసనాలు ఉంటాయని భావిస్తున్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు.
తాను రెండేళ్ల నుంచి సమాచారం హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఎవరూ ఇవ్వటం లేదన్నారు. ఆ గుట్టు తేల్చడానికి గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ విషయంపై నిజనిర్ధరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో దీనిపై నివేదిక ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హిందూ దేవుళ్లు
నాలుగు అంతస్తులు ఉన్న తాజ్‌మహల్‌లో ఎగువ, దిగువ భాగాల్లో సుమారు 22 గదులు మూసి ఉండటంపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. ఇవి దశాబ్దాల కాలంగా మూసి ఉన్నాయి. అయితే వీటి లోపల హిందూ దేవుళ్లు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. కానీ ఈ పిటిషన్‌ను విచారించేందుకు అల్‌హాబాద్ హైకోర్టులోని లఖ్‌నవూ బెంచ్ నిరాకరించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.