కరోనా కష్ట కాలంలో ప్రైవేట్ ఉద్యోగులతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగులు సైతం చనిపోవడంతో పలువురి కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఏదైనా కారణాలతో మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబానికి ఎక్స్-గ్రేషియా ఒకేసారి పరిహారం చెల్లించే నియమాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణకు ముందు వివిధ పరిస్థితులలో విధి నిర్వహణలో చనిపోతే వారి ఒకేసారి పరిహారం చెల్లించవచ్చు. ఈ మొత్తం నగదు ఆయా ఏడాది, సమయాన్ని బట్టి ఎప్పటికప్పుడు సవరించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబసభ్యుడికి లేదా గతంలో ఉద్యోగి పేర్కొన్న నామినీలకు ఈ భారీ మొత్తం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంపై కొన్ని సవరణలు చేశారు.
Also Read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం
ఉద్యోగి విధులు నిర్వహిస్తున్న సమయంలో పేర్కొన్న నామినీకి నగదు మొత్తం అందిస్తారు. డెత్ గ్రాట్యుటీ, జీపీఎఫ్ బ్యాలెన్స్, సీజీఈజీఐఎస్ నగదు మొత్తాన్ని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పేర్కొన్న నామినీకి అందుతాయి. ఒకవేళ నామినీ వివరాలు లేని పక్షంలో కుటుంబసభ్యులలో ఒకరికి పరిహారం నగదు అందిస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ సెప్టెంబర్ 30, 2021న ఓ ప్రకటనలో తెలిపింది. సీసీఎస్ పెన్షన్ రూల్స్, 1972లోని నామినేషన్ ఫామ్ అయిన ఫామ్ 1లో పరిహారానికి సంబంధించి కొన్ని మార్పులు చేశారు.
నామినేషన్ చేయకపోతే..
డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) ప్రకారం.. ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నామినేషన్ వివరాలు పేర్కొనని పక్షంలో చనిపోయిన ఉద్యోగి కుటుంబసభ్యులు అందరికీ నగదు మొత్తం సమాన వాటాలుగా అందిస్తారు. రూల్ 51 ప్రకారం ఈ పరిహారం అందించాలని మార్పులు జరిగాయి.
Also Read: బ్యాంకు నిబంధనల్లో కొత్త మార్పులు! కస్టమర్లకు లాభమా? నష్టామా? తెలుసుకోండి!
కుటుంబం నుంచి నామినేషన్ లేకపోతే..
డీఓపీపీడబ్ల్యూ ప్రకారం.. కుటుంబానికి చెందని వ్యక్తిని నామినీగా పేర్కొన్న సందర్భాలలో వారికి పరిహారం అందదు. ఉద్యోగికి సొంత కుటుంబం లేకపోయినా ఇతర వ్యక్తులను నామినీగా చేర్చితే వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించనక్కర్లేదని రూల్స్‌లో మార్పులు చేశారు.
కొత్త రూల్ ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రస్తుత రూల్స్ ప్రకారం నామినీకి నగదు మొత్తం, గ్రాట్యుటీ, జీపీఎఫ్ బ్యాలెన్స్, సీజీఈజీఐఎస్ నగదును అందిస్తారు. సీసీఎస్ రూల్స్ 1932 ప్రకారం కుటుంబంలో ఎవరికి పరిహారం చెల్లించాలనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. తాజాగా చేసిన సవరణలతో నామినీ పేరు పేర్కొనని సందర్భంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ సమానంగా వాటాలుగా విభజించి పరిహారం, ఇతరత్రా బెనిఫిట్స్ చెల్లించనున్నారు. ఏడవ వేతన సంఘం సిఫార్సుతో ఆర్థిక శాఖ పరిహారంపై నిర్ణయం తీసుకుని స్వల్ప మార్పులు చేసింది.
Also Read: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు