ఏదైనా బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలో మీరు రుణం తీసుకొన్నారా? నెలవారీ చెల్లింపులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతాలో ఆధార్, మొబైల్ నంబర్ అప్‌డేట్ కాలేదా? డీమ్యా్‌ట్ ఖాతాకు కేవైసీ చేయించలేదా?
అయితే..! ఈ అక్టోబర్ 1 నుంచి మీ ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో జరిగే మార్పులను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు ఈ సెప్టెంబర్ 30 నుంచి బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీల్లో కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయి. ఆ విశేషాలు మీ కోసం!!
Also Read: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఫారెస్ట్ వాలెట్లు, గిఫ్ట్ కాంబోలపై సూపర్ డిస్కౌంట్లు!
ఆటో డెబిట్‌కు అనుమతి
భారతీయ రిజర్వు బ్యాంకు సరికొత్త మార్గదర్శకాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ లావాదేవీలు ఆగిపోనున్నాయి! క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి ఆటో డెబిట్ లావాదేవీలు కొనసాగాలంటే ఇకపై ప్రతి నెలా వినియోగదారులు అందుకు అనుమతి ఇవ్వాలి. రుణ వాయిదాలు, ఈఎంఐ, మొబల్ బిల్ పేమెంట్, కరెంట్ బిల్లు, సిప్ చెల్లింపులు, ఓటీటీ, క్రెడిట్ కార్డు సహా అనేక చెల్లింపులకు మీ అనుమతి తప్పనిసరి.
మీ అనుమతి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు చెల్లింపు తేదీకి ఐదు రోజులు ముందుగానే మీకు నోటిఫికేషన్ పంపిస్తాయి. వాటికి మీరు అనుమతిస్తేనే బ్యాంకులు ఆటో డెబిట్ చేస్తాయి. ఒకవేళ చెల్లించాల్సిన మొత్తం రూ.5000 మించినట్టైతే ఓటీపీ ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
వాస్తవంగా ఈ పద్ధతి 2021, ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ వంటి పెద్ద బ్యాంకులు అందుకు అవసరమైన ఏర్పాట్లను సకాలంలో చేసుకోలేకపోయాయి. దాంతో ఆర్బీఐ మరో ఆరు నెలలు గడువు పొడగించింది. సెప్టెంబర్ 30తో అది పూర్తవుతోంది.
Also Read: చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరింత పెరుగుదల
మీ మొబైల్ నంబర్ కరెక్టేనా?
కొత్త నిబంధనల ప్రకారం డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆటో డెబిట్ చెల్లింపులు సవ్యంగా సాగాలంటే బ్యాంకుల వద్ద మీ మొబైల్ నంబర్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. బ్యాంకు వద్ద మీ మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే వారు పంపే సందేశాలు ఇతరులకు వెళ్తాయి. లేదా మీకు రావు. అప్పుడు ఆటో డెబిట్ ధ్రువీకరణ కాదు. చెల్లింపులు జరగవు. ఆటో డెబిట్ చెల్లింపులు మిస్సైతే వినియోగదారుడే జరిమానా లేదా అదనపు రుసుములు కట్టాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకు వద్ద మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం మరిచిపోవద్దు!
Also Read: ఆర్‌బీఎల్ బ్యాంకుకు ఆర్‌బీఐ షాక్.. రూ.2 కోట్ల జరిమానా!
డీమ్యాట్‌కు కేవైసీ
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీలు పూర్తవ్వాలని గతంలోనే ఆదేశించింది. 2021, జులై 31గా ఉన్న తుది గడువును 2021, సెప్టెంబర్ 30కి పొడగించింది. సెబీ ఆదేశాల ప్రకారం డీ మ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెరిచేటప్పుడే వినియోగదారులు తమ పూర్తి పేరు, చిరునామా, పాన్, మొబైల్ నంబర్, ఈమెల్ ఐడీ, ఆదాయ శ్రేణిని వెల్లడించాల్సి ఉంటుంది. అలా లేకుంటే వెంటనే కేవైసీని అప్‌డేట్ చేయాలి. లేదంటే డీ మ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు అచేతనంగా మారతాయి. ఒకవేళ మీరు షేర్లు కొనుగోలు చేసినా అవి మీ ఖాతాల్లోకి బదిలీ కావు.