India Vote Against Russia: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ఇప్పటివరకు ఆచితూచి వ్యవహరించింది భారత్. ఎందుకంటే ఎప్పుడు ఆపద వచ్చిన భారత్‌కు రష్యా వెన్నుదన్నుగా నిలిచింది. అందుకే అంతర్జాతీయ వేదికలపై రష్యాను విమర్శించడం లేదా వ్యతిరేకించడం భారత్ చేయలేదు. కానీ తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.


వ్యతిరేకంగా


రష్యా డిమాండ్‌ను తిరస్కరిస్తూ ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత్‌ ఓటు వేసింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బానియా తీర్మానం ప్రతిపాదించింది. దీనిపై రికార్డెడ్‌ ఓటింగ్‌ నిర్వహించాలని కోరింది.


కానీ రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేసింది. దీంతో రష్యా డిమాండ్‌పై ఐరాసలో ఓటింగ్ జరిగింది. అయితే రష్యా డిమాండ్‌ను 107 దేశాలు తిరస్కరించాయి. అనూహ్యంగా వీటిల్లో భారత్‌ కూడా ఉంది. రికార్డెడ్‌ బ్యాలెట్‌కు అనుకూలంగా భారత్ ఓటు వేసింది. కేవలం 13 దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా మద్దతు తెలిపాయి. మరో 39 దేశాలు ఓటింగ్‌కు దూరమయ్యాయి. వీటిల్లో రష్యా, చైనా కూడా ఉన్నాయి.


ఇటీవల


ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను విలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించిన రిఫరెండంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇటీవల ఓటింగ్‌ జరిగింది. ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది.


ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌.. ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్‌ సంతకాలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్‌ జరిగింది. భారత్‌ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉంది. భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్ దేశాలు కూడా ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.


రష్యా మాత్రం వీటో చేసింది. రష్యా రిఫరెండాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఆల్బేనియా దేశాలు భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 


కుదరదు 


భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వీటో పవర్‌ను వినియోగించడంతో అమెరికా, ఆల్బేనియా తీర్మానం ఆమోదం పొంద లేదు. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా, 10 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. భారత్, చైనా, గబాన్, బ్రెజిల్‌ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడారు.


" ఉక్రెయిన్‌ పరిణామాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను బలిపెట్టి శాంతిని సాధించలేరు. హింసకు స్వస్తి పలికితేనే ఉక్రెయిన్‌–రష్యా సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుంది.  "
-                                                           రుచిరా కాంబోజ్, ఐరాసలో భారత ప్రతినిధి


Also Read: PM Modi Gujarat Visit: సెక్యూరిటీని కూడా పట్టించుకోకుండా ఆ వ్యక్తిని కలిసిన మోదీ- ఎందుకంటే?


Also Read: Next Chief Justice of India: 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్- ప్రతిపాదించిన భారత ప్రధాన న్యాయమూర్తి!