Next Chief Justice of India: తదుపరి సీజేఐ పేరును భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ప్రతిపాదించారు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన పేరును ప్రతిపాదిస్తూ సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ లేఖ రాశారు.


మంగళవారం ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు లాంజ్​లో న్యాయమూర్తుల సమక్షంలో జస్టిస్ యూయూ లలిత్ ఈ లేఖను జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు అందించారు​. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 9న తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 


ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్​ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. సాధారణంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూచించే పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉంటుంది.


రెండేళ్ల పాటు


జస్టిస్ చంద్ర‌చూడ్‌ 50వ భారత ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఆయన చాలా రోజులు ఆ ప‌దవిలో ఉండే ఛాన్సు ఉంది. 2024 న‌వంబ‌ర్ 10న జస్టిస్ డీవై చంద్రచూడ్‌ రిటైర్ అవుతారు. అంటే రెండేళ్ల పాటు ఆయ‌న ఆ ప‌దవిలో ఉంటారు. 


జస్టిస్ యూయూ లలిత్


ఈ ఏడాది ఆగస్టు 27న 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరించారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జస్టిస్ యూయూ లలిత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు జెట్ స్పీడ్‌తో పనిచేస్తోంది. ఇటీవల నాలుగు రోజుల్లో దాదాపు 1800 కేసులకు సుప్రీం కోర్టు పరిష్కారం చూపింది.


వేగంగా పూర్తి


చీఫ్ జస్టిస్‌గా యూయూ లలిత్ కేవలం 74 రోజుల పాటు పదవిలో ఉంటారు. నవంబర్ 8న ఆయన రిటైర్ అవుతారు. దీంతో తక్కువ వ్యవధిలో కేసులకు శరవేగంగా పరిష్కారం చూపించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఆగస్ట్ 27న భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు స్వీకరించారు. మొదటి నాలుగు రోజుల్లోనే సుప్రీంకోర్టులో 1,293 కేసులను పరిష్కరించారు. 1,293 కేసుల్లో ఆగస్ట్ 29న 493, 30న 197, సెప్టెంబర్ 1న 228, సెప్టెంబర్ 2న 315 కేసులు పరిష్కారమయ్యాయి. ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించే 106 రెగ్యులర్ కేసులను కూడా తేల్చేసినట్టు సీజేఐ తెలిపారు. మరో 440 కేసుల బదిలీ పిటిషన్లను పరిష్కరించినట్టు చెప్పారు. దీంతో మొత్తం 1800 కేసుల వరకు విచారించినట్లయింది. 


ప్రతి రోజు వీలైనన్ని కేసులను పరిష్కరించే లక్ష్యంతో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నేను బాధ్యతలు స్వీకరించడానికి ముందు కంటే ఎక్కువ కేసులను విచారణకు తీసుకురాగలిగాం. నా 74 రోజుల కాల వ్యవధిలో ప్రతి రోజూ వీలైనన్ని కేసుల పరిష్కారానికి కృషి చేస్తాను.                                                       "


-జస్టిస్ యూయూ లలిత్, సీజేఐ