Indian Army Dog Zoom: ఎండనక, వాననక, పగలనక, రాత్రనక.. దేశం కోసం కంటి మీద కునుకు లేకుండా సరిహద్దుల్లో కాపాలా కాసే జవాన్ల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం. దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయరు సైనికులు. అయితే వారి దగ్గర శిక్షణ తీసుకునే శునకాలు కూడా అంతే. చావుకు ఏమాత్రం తలొగ్గే తత్వం వాటిది కాదు. తాజాగా ఓ వీర శునకం.. తన శరీరంలో బుల్లెట్లు దిగినా, లెక్క చేయకుండా ముష్కరులతో పోరాడింది. వారిని ఆర్మీకి పట్టించింది.
ఇదీ జరిగింది
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో ఆర్మీ.. సోమవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 'జూమ్' అనే ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది.
పట్టుకుని
ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని తొలుత భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో సైన్యం.. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్' అనే ఆర్మీ కుక్కను పంపారు. దీంతో 'జూమ్' ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలో కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా 'జూమ్' వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్‌లో పలువురు జవాన్లు గాయపడ్డారు.
చికిత్స
ఆ తర్వాత అధికారులు 'జూమ్'ను హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 'జూమ్' శిక్షణ పొందిన నిబద్ధత కలిగిన వీర శునకమని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో 'జూమ్' నేర్పరి. ప్రస్తుతం చికిత్స పొందుతోన్న ఈ వీర శునకం త్వరగా కోలుకోవాలని ఆర్మీ అధికారులు ట్విట్టర్‌లో 'జూమ్' వీడియోను షేర్ చేశారు.
Also Read: Bengal Jobs Scam: బంగాల్ సీఎం మమతా బెనర్జీకి షాక్- ఆ కుంభకోణంలో మరో ఎమ్మెల్యే అరెస్ట్!