Bengal Jobs Scam: బంగాల్‌లో టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. రాత్రంతా ప్రశ్నించిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
రెండో నేత
మాణిక్ భట్టాచార్య.. ఈ కుంభకోణంలో అరెస్టయిన రెండో తృణమూల్ నాయకుడు. బంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీని ఈ కేసులో జులైలో అరెస్టయ్యారు. పార్థ ఛటర్జీ సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు దొరికిన క్రమంలో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది.
పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అక్రమ నగదు లావాదేవీలకు సంబంధించి దర్యాప్తు చేపట్టింది ఈడీ. ఇప్పటికే అరెస్టైన మాజీ మంత్రి పార్థ ఛటర్జీ వాట్సాప్ చాట్‌ను పరిశీలించగా ఈ కేసులో లంచాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే భట్టాచార్యపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
అరెస్ట్ తర్వాత భట్టాచార్యను వైద్య పరీక్షల నిమిత్తం తరలించి.. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ కేసులో మాణిక్ భట్టాచార్య పేరు బయటకు రావటంతో ఆయనను బంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.
భారీగా నోట్ల కట్టలు
సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇటీవల భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈడీ జరిపిన సోదాల్లో ఆమె ఇంట్లో తొలుత రూ.21 కోట్లు బయటపడగా అనంతరం మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపింది. ఆమె అపార్ట్‌మెంట్‌లోని షెల్ఫ్‌లో నోట్ల కట్టలు గుర్తించారు అధికారులు. ఈ డబ్బంతా పార్థ ఛటర్జీదేనని విచారణలో అర్పితా.. అధికారులకు తెలిపారు.
మరోవైపు ఈ నేరారోపణలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అర్పిత ఇంట్లో అధికారులు ఒక 40 పేజీల డైరీని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Diwali Vacation 2022: ఉద్యోగులకు కృతజ్ఞతగా 10 రోజుల దీపావళి సెలవులు- ఓ ప్రైవేట్ కంపెనీ ఆఫర్