Zomato CEO Deepinder Goyal : కంపెనీ సీఈఓ అంటే బిజినెస్ ప్లాన్ చెక్ చేసుకోవడం, టాప్ లెవెల్ ఉద్యోగులతో రోజువారీ మీటింగ్‌లో పాల్గొనడం చేస్తుంటారు. సాధారణ ఉద్యోగులు కూడా కాస్త స్టైలిష్ గా రెడీ అయ్యి ఆఫీసుకు వెళ్లి వర్క్ చేసుకోవడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. అయితే కంపెనీ సీఈఓ అయి ఉండి కూడా సాధారణ డెలివరీ బాయ్‌లా అప్పుడప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్. తమ డెలివరీ బాయ్స్ లాగే రెడ్ టీ షర్ట్ ధరించి కామన్ మ్యాన్‌లా వెళ్లి ప్రతి మూడు నెలలకు ఓసారి ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. 


జొమాటో సీఈఓ ఫుడ్ డెలివరీ చేస్తుంటారని నౌకరీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ సంజీవ్ బిక్ చందానీ తెలిపారు. ఇటీవల దీపిందర్ గోయల్ తో ఇంటరాక్షన్‌లో భాగంగా తాను ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు నౌకరీ డాట్ కామ్ ఓనర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దాంతో సంజీవ్ బిక్ చందానీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తన ఉద్యోగులు ఎదుర్కొనే పరిస్థితులను అర్థం చేసుకునేందుకు, కస్టమర్ల రియాక్షన్ చూసేందుకు సీఈఓ సరైన పని చేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.






జొమాటో సీఈఓను ఒక్కరూ గుర్తుపట్టలేదు..
‘దీపిందర్ గోయల్‌ను, జొమాటో టీమ్‌ను ఇటీవల కలిశాను. అక్కడి సీనియర్ మేనేజర్లు ప్రతి మూడు నెలలకు ఓసారి బైకుపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తున్నారని తెలుసుకున్నాను. వారు మాత్రమే కాదు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సైతం ప్రతి 3 నెలలకు కంపెనీ రెడ్ టీ షర్ట్ ధరించి కామన్ ఫుడ్ డెలివరీ బాయ్ లా వెళ్లి పార్సిల్స్ డెలివరీ చేస్తుంటారు. అయితే ఒక్కరు కూడా తనను గుర్తుపట్టలేదని జొమాటో సీఈఓ నాకు చెప్పారంటూ’ సంజీవ్ బిక్ చందానీ వెల్లడించారు.


సోషల్ మీడియాలో కామెంట్ల వెల్లువ..
సీఈఓ చాలా గొప్ప పని చేశారని, ఆయన చూపిన చొరవ అద్భుతమని నెటిజన్లు అంటున్నారు. కస్టమర్‌లను/వ్యాపార భాగస్వాములను అర్థం చేసుకోవడానికి ఈ పని దోహదం చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇంట్లో కూర్చుని సమస్యల గురించి ఆలోచించడం కంటే రంగంలోకి దిగి విషయం తెలుసుకోవడం బెటర్ అని, అందుకే ప్రతి 3 నెలలకు ఒకసారి కంపెనీ టీ-షర్ట్‌ ధరించి ఆర్డర్స్ తీసుకుని డెలివరీ చేస్తున్నారు. జొమాటో సీఈఓతో పాటు కంపెనీ టాప్ లెవెల్ మేనేజర్లు సైతం ఇదే పని గత మూడేళ్లుగా చేయడం చాలా మంచి ఆలోచన అని కొనియాడారు. కానీ మూడేళ్ల నుంచి ఒక్క కస్టమర్ కూడా సీఈఓను గుర్తించలేదని, బహుశా తమకు కూడా ఆయన ఓ ఆర్డర్ డెలివరీ చేసి ఉంటారని సరదాగా నెటిజన్లు స్పందిస్తున్నారు.