MLA Kodali Nani: అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు చేస్తున్నది మహా పాదయాత్ర కాదు అని అది టీడీపీ ప్రభుత్వంపై చేస్తున్న మహా దండయాత్ర అని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించి అమరావతి రైతులకు ఆశ చూపి మంచి పంటలు పండే భూములను తీసుకున్నారని ఆరోపించారు. రైతులను మభ్యపెట్టారన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, కోకాపేట అంటూ ఏవేవో కబుర్లు చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు. హైదరాబాద్ ను తానే నిర్మించానని చెప్పి, ఇక్కడి రైతుల పొలాలు తీసుకున్నారని విమర్శించారు. అమరావతి కోసం దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు.
"పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని రైతులను అడ్డం పెట్టుకుని టీడీపీ చేస్తున్న దండయాత్ర ఇది. సీఎం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలని రైతుల ముసుగులో ప్రతిపక్షనేత చంద్రబాబు చేస్తున్న కుల యాత్ర ఇది. పవన్ కల్యాణ్ చిరంజీవి కంటే పెద్ద స్టార్. పవన్ కల్యాణ్ చిరంజీవి కంటే పెద్ద పొలిటిషియన్. ఆయనకు ఈయన అవసరం ఏముంటది. అంటే మనకంటే పెద్ద వాళ్లతోనే మనకు అసవరం ఉంటది. చిన్న వాళ్లతో మనకేం అవసరం ఉంటది. అయినా చంద్రబాబు ఉండగా పవన్ కల్యాణ్ కు మరెవరీ సపోర్ట్ అవసరం ఉండదు. ఆయన తీసుకోరు కూడా" - కొడాలి నాని
పవన్ కల్యాణ్ కు ఎవరి సపోర్ట్ అవసరం లేదు..
గుడివాడ వచ్చి నన్ను ఓడిస్తానని చెప్పిన ప్రతీ టీడీపీ నాయకుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. గుడివాడలో నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చిల్లర డబ్బుల కోసం ఆశ పడిన జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీలు పది జెండాలు పట్టుకొని యాత్రకు కొమ్ముకాస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి విలేకరి అడగ్గా... పవన్ కల్యాణ్ గొప్ప నటుడు, సీనియర్ రాజకీయవేత్త, అయనకు చిరంజీవి మద్దతు అవసరం లేదు. మద్దతు తీసుకునే స్థాయిలో పవన్ లేడు అంటూ ఎద్దేవా చేశారు.
కాలమే సమాధానం చెప్పాలి..
"కేసీఆర్ ఒక ఉద్యమ నేత. ఆయన దేశ రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉంది. ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నాడు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే సరికి.. తెలంగాణ ఉద్యమం అనేది ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి తెలంగాణను, హైదరాబాద్ ను వదులుకొని వెనక్కి రావడం మనకి ఇష్టం లేదు కాబట్టి.. అప్పుడు వ్యతిరేకించాం. కానీ ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏపీ ప్రజలు టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు. కేసీఆర్ ను అభిమానిస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అవుతుంది. ఆయనకు ఇక్కడ కాస్త వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. ఎవరైనా క్యాండిడేట్ లు దొరికే అవకాశం ఉంది. దీనికి కాలమే సమాధానం చెబుతుంది." అని ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు
అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను ఆంధ్ర ప్రజలు వ్యతిరేకించారని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎంత వరకు మద్దతు లభిస్తుందో కాలమే చెప్పాలని వ్యాఖ్యానించారు.