మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవి కిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అక్టోబర్ 10(2022) నాటికి ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఏఎంబీ సినిమాస్‌ లో స్పెషల్ షో వేశారు. ఈ ప్రదర్శనలో సినిమా యూనిట్ పాల్గొన్నది. షో అనంతరం నాటి ఈ సినిమా అనుభవాలను దర్శక నిర్మాతలు, నటీనటులు పంచుకున్నారు.    


నాలోని రచయితను, దర్శకుడిని  నాకంటే ఎక్కువగా గుర్తించిన వ్యక్తి రవికిశోర్-త్రివిక్రమ్


తాను చెప్పిన కథ విని ఎంతో నమ్మి ‘నువ్వే నువ్వే’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రవి కిశోర్ ఇచ్చారని త్రివిక్రమ్ చెప్పారు. ఆయనకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదన్నారు. తనలో ఉన్న రచయితను,  దర్శకుడిని, తనకంటే ఎక్కువగా గుర్తించి, ఇష్టపడ్డ వ్యక్తి రవి కిశోర్ అన్నారు. ఆయనకు, సీతారామశాస్త్రి గారి మధ్య ఉన్న లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఇంకెవరి మధ్య చూడలేదన్నారు.  అటువంటి సీతారామశాస్త్రి గారి దివ్య స్మృతికి ఆయన పాదాల దగ్గర ఈ సినిమాను పెట్టి.. ఈ చిత్ర బృందం నివాళిగా అర్పిస్తుందని వెల్లడించారు. దర్శకుడిగా తనను పరిచయం చేసిన 'స్రవంతి' రవికిశోర్ పాదాలకు ఈ సందర్భంగా త్రివిక్రమ్ నమస్కరించారు.     


''వనమాలి హౌస్‌లో 'నువ్వే కావాలి' షూటింగ్  జరుగుతుంది. రవికిశోర్ గారు, నేను పక్కన ఖాళీ స్థలంలో నడుస్తూ మాటల మధ్యలో కథ చెప్పా. ఆయన చెక్ బుక్ తీసి ఒక అమౌంట్ వేసి ఇచ్చారు. 'నువ్వే కావాలి'కి రైటర్‌గా ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో... దాదాపుగా అంత అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. నేను దాంతో బైక్ కొనుక్కున్నాను. అప్పటికి నేను రాసిన 'నువ్వే కావాలి' షూటింగ్‌లో ఉంది. నేను ఏం చేయగలనో తెలియదు. కానీ, నేను చెప్పిన కథ విని రవికిశోర్ గారు ఎంతో నమ్మారు. ఆయనకు నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా సరిపోదు” అన్నారు. 


'నువ్వే నువ్వే'ను సిరివెన్నెలకు అంకితం ఇస్తున్నాం- స్రవంతి కిశోర్


త్రివిక్రమ్ చెప్పిన ‘నువ్వే నువ్వే’ కథ తనకు ఎంతో బాగా నచ్చిందని స్రవంతి కిశోర్ వెల్లడించారు. ఈ కథ వినగానే తండ్రి పాత్ర ప్రకాశ్ రాజ్ మాత్రమే చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పారు.  అనుకున్నట్లుగానే ఆయన ఈ సినిమాలో అద్భుతంగా నటించారన్నారు. వండ‌ర్‌ఫుల్‌ కాస్ట్ అండ్ క్రూ ఈ చిత్రానికి కుదిరిందన్నారు అటు త్రివిక్రమ్ ఓ వండర్ గా అభివర్ణించారు. మేజిక్ క్రియేట్ చేస్తాడని చెప్పారు. నేను రాముడు అని  ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే  సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లేకపోవడం బాధాకరం అన్నారు.  ఆయనతో తనకున్న అనుబంధం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదన్నారు.  'నువ్వే నువ్వే' సినిమాను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు.


20 ళ్లైనా.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది- తరుణ్


‘నువ్వే నువ్వే’ విడుదలై 20 ఏండ్లు అయినా..  ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉందని హీరో తరుణ్ అన్నారు. బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్ లో  ఈ సినిమా చూస్తానని చెప్పారు. హీరోగా నా తొలి సినిమా 'నువ్వే కావాలి'కి త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన ఎంత మంది హీరోలతో చేసినా... ఆయన ఫస్ట్ హీరో నేనే అన్నారు. ప్రకాశ్ రాజ్, శ్రియ, ఇతర నటీనటులు అందరితో పని చేయడం సంతోషంగా ఉందన్నారు.


సినిమా ఒక బ్యూటిఫుల్ మెమరీ-శ్రియ


త్రివిక్రమ్, రవికిశోర్  ఢిల్లీకి వచ్చిన నాకు కథ చెప్పగానే ఎంతో నచ్చిందని చెప్పారు శ్రియ. షూటింగ్ చాలా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించింది. తరుణ్ స్వీట్ కో స్టార్ అని చెప్పింది. ప్రకాశ్ రాజ్  తన తండ్రిలా ఉండరని, సినిమాలో మాత్రం తండ్రి క్యారెక్టర్ చేశారని చెప్పింది.  ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ మెమరీగా నిలిచి ఉంటుందని చెప్పింది.    


నాపై బ్యాన్ తీసే వరకూ వెయిట్ చేశారు- ప్రకాశ్ రాజ్


'నువ్వు నాకు నచ్చావ్' కోసం నన్ను బ్యాన్ చేస్తే, నాపై బ్యాన్ తీసే వరకూ త్రివిక్రమ్, రవి కిశోర్ వెయిట్ చేశారని ప్రకాశ్ రాజ్ చెప్పారు.  సినిమా అంటే ఎంతో ప్రేమించే రవికిశోర్, త్రివిక్రమ్ తో జర్నీ ఎంతో బాగా ఎంజాయ్ చేశానన్నారు.  


Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?


Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్