PM Modi Gujarat Visit: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల్లో మోదీని అభిమానించే వాళ్లు ఉన్నారు. అయితే ప్రధాని మోదీని కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం అందరికీ దొరకదు. ఎందుకంటే ప్రధాని మోదీకి పటిష్ట భద్రత ఉంటుంది. ఎస్‌పీజీ గార్డ్స్ ఎప్పుడూ మోదీ వెంటే ఉంటారు. అయితే స్వయంగా మోదీ తన భద్రతను కూడా పట్టించుకోకుండా ఓ వ్యక్తిని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఎందుకంటే?


గుజరాత్‌లో ప్రధాని మోదీ సోమవారం పర్యటించారు. భరూచ్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి 'బల్క్ డ్రగ్ పార్క్'కి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జామ్‌నగర్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ రోడ్‌షో సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక్కసారిగా కారు దిగి.. రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఇది చూసి అక్కడున్న ప్రజలతో పాటు, భద్రతా సిబ్బంది కూడా షాకయ్యారు.






ప్రధాని మోదీని చూసేందుకు ఓ వ్యక్తి  ఒక చిత్రపటం పట్టుకుని అక్కడ నిల్చొని ఉన్నాడు. ఇది గమనించిన మోదీ కారు దిగి నేరుగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. వెంటనే ఆ వ్యక్తి ఓ చిత్రాన్ని మోదీకి బహూకరించారు. ఆ చిత్రంలో ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌ ఉన్నారు. దీంతో ఫోటోపై ప్రధాని ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు.


ఆ వ్యక్తితో ప్రధాని ప్రేమగా మాట్లాడి, తన తల్లి చిత్రపటం బహుకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


నెహ్రూపై విమర్శలు


భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు చేశారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆనంద్‌లో జరిగిన ర్యాలీ ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కశ్మీర్ సమస్యను ప్రధాని లేవనెత్తారు.



సర్దార్ సాహెబ్ అన్ని సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసేందుకు అందర్నీ ఒప్పించారు. అయితే 'ఒక వ్యక్తి' (నెహ్రూ).. కశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయారు. నేను సర్దార్ సాహెబ్ అడుగుజాడల్లో నడుస్తున్నాను. నేను ఆయన విలువలను పాటిస్తాను. అందుకే కశ్మీర్ సమస్యను పరిష్కరించాను. సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళులు అర్పించాను.                                                     "
- ప్రధాని నరేంద్ర మోదీ



గుజరాత్ సీఎం అయినప్పుడు తనకు పరిపాలనలో పెద్దగా అనుభవం లేదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అయితే సీఎం భూపేంద్ర పటేల్‌కు పంచాయితీ నుంచి అసెంబ్లీ వరకు 25 ఏళ్ల అనుభవం ఉండడం మన అదృష్టమన్నారు.


Also Read: Next Chief Justice of India: 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్- ప్రతిపాదించిన భారత ప్రధాన న్యాయమూర్తి!