IND VS SA 3rd ODI: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు కీలకమైన చివరి వన్డే జరగనుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం టీమిండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వన్డే సిరీస్‌లో ఇరు జట్లు ప్రస్తుతం 1-1తో ఉన్నాయి. నేడు జరగనున్న వన్డేలో నెగ్గిన జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్ లక్నోలో జరగగా వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ పోరాడానా భారత్ 9 పరుగులతో ఓటమిపాలైంది. రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. దాంతో సిరీస్ ఫలితం తేలేందుకు నిర్ణయాత్మక మూడో వన్డే వరకు వేచి చూడక తప్పదు.
ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి రానున్నారు. దాంతో మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. చివరి మెట్రో రైలు సర్వీసు టైమింగ్ పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో అధికారులు ప్రకటించారు.
ఢిల్లీ మెట్రో రైలు సర్వీస్ టైమ్ పొడిగింపు..
రెడ్ లైన్‌లో సాధారణంగా రాత్రి 11కు చివరి మెట్రో కాగా, నేటి మ్యాచ్ కోసం రాత్రి 11:50 గంటలకు లాస్ట్ మెట్రో సర్వీస్ రన్ చేస్తున్నారు. ఎల్లో లైన్లోనూ లాస్ట్ మెట్రో రైలు రాత్రి 11:50 గంటలకు డీఎంఆర్‌సీ రన్ చేస్తోంది. బ్లూ లైన్ లో రెగ్యూలర్ 10:52 కు చివరి మెట్రో అయితే నేడు రాత్రి 11:25కు చివరి మెట్రో రైలు బయలుదేరనుంది. నోయిడా వైపు అయితే 11:10 కి , వైశాలి వైపు అయితే 11:20కు చివరి మెట్రో సర్వీస్ బయలుదేరుతుంది.
గ్రీన్ లైన్ రెగ్యూలర్ టైమ్ కాశ్మీర్ గేట్ వైపు 11 గంటలకు కాగా, నేటి రాత్రి 11:40 నిమిషాలు.. రాజా సింగ్ నగర్ కు రెగ్యూలర్ గా 10:36కు చివరి రైలు కాగా నేటి రాత్రి 10:55 కు చివరి మెట్రో రైలును ఢీఎంఆర్‌సీ నడుపుతోంది. పింక్ లైన్ లో నేడు చివరి మెట్రో రాత్రి 11:40కు, మేజెంట లైన్ లో చివరి మెట్రో సర్వీస్ అర్ధరాత్రి 12:40కు, బొటానికల్ గార్డెన్ వైపు 12:30కు బయలుదేరుతుంది. గ్రే లైన్ లో చివరి మెట్రో రాత్రి 1 గంటకు బయలుదేరుతుంది.
ఢిల్లీలో వాతావరణం
నేడు ఢిల్లీలో మ్యాచ్ కావడంతో అధికారులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వర్షంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. మూడో వన్డే మ్యాచ్ పై వర్షం నీడలు కమ్ముకున్నాయి. ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కానీ ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది.