చెన్నై, తమిళం, CSK పట్ల మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేనిది. దాన్ని ఇప్పుడు ధోని వేరే లెవల్‌కు తీసుకెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ధోని ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని ప్రారంభించి, ఈ బ్యానర్‌పై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రపంచకప్ విజేత కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించాడు. రోర్ ఆఫ్ ది లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ది హిడెన్ హిందు వంటి చిన్న తరహా చిత్రాలను ఈ బ్యానర్‌పై నిర్మించారు.


ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విడుదలైన మూడు సినిమాలు ఇవే. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఈ ప్రొడక్షన్ హౌస్‌ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తమిళం, తెలుగు మరియు మలయాళం అనే మరో మూడు భాషలలో సినిమాలను నిర్మించాలని యోచిస్తున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ధోని అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుండి రిటైర్ అయ్యాడు. కానీ ఇప్పటికీ అత్యంత విజయవంతమైన IPL ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలో 50 ఓవర్ల ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ICC ఛాంపియన్స్ ట్రోఫీ... ఇలా మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ కూడా ధోనినే.


మరి ఈ బ్యానర్‌పై ధోని ఏ సినిమాలు తీస్తాడు, ఎవరితో తీస్తాడు, ఈ క్రికెట్ దిగ్గజంతో చేతులు కలిపే యాక్టర్స్ ఎవరనే విషయం తెలియాలంటే మాత్రం మరింత కాలం ఆగాలి. ఎందుకంటే ధోని ఈ విషయమై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. బ్యానర్ పెట్టి సినిమాలు ప్రకటించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.