Hyderabad Rains : హైదరాబాద్ ను వరుణుడు వదలడం లేదు. సోమవారం మరోసారి నగరంలో వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు వస్తూ అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడ్డాయి. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుంతపోత వర్షం కురిసింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం దాటికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లోని కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ, బషీర్‌బాగ్, హైదర్‌గూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, సనత్‌నగర్‌ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
మరో రెండ్రోజులు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. యూసుఫ్ గూడ, నాంపల్లి, హిమాయత్‌నగర్, ఉప్పల్, విద్యానగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీగా వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ, బీఆర్ఎస్, విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. బంగాళాఖాతంలో ఇవాళ లేదా రేపు మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. త్వరలోనే ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.