Mla Nimmala Ramanaidu : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఓ మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తీరు వివాదాస్పదం అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాలకొల్లు పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సోమవారం పాల్గొన్నారు. ఓవైపు పాదయాత్ర, మరోవైపు వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయమై ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు ఎమ్మెల్యే రామానాయుడును ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రామానాయుడు మహిళ చేతిలోంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. సెల్ ఫోన్ కింద పడేయడానికి కూడా ప్రయత్నించారు. దీంతో మహిళ ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని అడ్డుకుంది. కాసేపు ఎమ్మెల్యే, మహిళా ప్రయాణికురాలికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అదే బస్సులో ఉన్న వ్యక్తి ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో వైరల్ గా కావడంతో ఎమ్మెల్యే తీరును నెటిజన్లు, వైసీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి.
ఎమ్మెల్యే చొక్కా పట్టుకున్న మహిళ
టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆర్టీసీ బస్సులో మహిళ సెల్ ఫోన్ లాక్కొన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్రాఫిక్ జామ్ అవ్వడానికి కారణం మీరే అంటూ మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించింది. దీంతో అసహనానికి గురైన ఎమ్మెల్యే మహిళ చేతిలోంచి ఫోనును బలవంతంగా లాక్కొన్నారు. సదరు మహిళ ఎమ్మెల్యేపై తిరగబడింది. ఎమ్మెల్యేను చొక్కా పట్టుకుని లాగి తన ఫోను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అమరావతి నుంచి అరసవెల్లికి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అమరావతి రైతులకు అక్కడక్కడా నిరసన సెగలు తగులుతున్నాయి. ఉత్తరాంధ్రపై చేస్తున్న దండయాత్రంటూ వైసీపీ నేతలు యాత్ర మార్గంలో పోస్టర్లు, ఫెక్సీలు పెడుతున్నారు. రైతుల పాదయాత్రపై మండిపడుతున్నారు. పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంటర్ అయ్యే సమయంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నేతలు ఇప్పటికే జేఏసీ ఏర్పాటు చేసి పాదయాత్రను అడ్డుకుంటామని బహిరంగంగా సవాల్ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కూడా అమరావతి రైతులకు నిరసనలు ఎదురయ్యాయి. పాదయాత్రను నిరసిస్తూ వైసీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేశారు. గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు.
Also Read : Minister Jogi Ramesh : ట్విట్టర్లో సినిమా డైలాగ్స్ కాదు, పవన్ కు దమ్ముంటే విజయవాడ రావాలి - జోగి రమేష్
Also Read : VijaySai Reddy Lands Issue : విశాఖలో విజయసాయిరెడ్డి భూదందాపై సీబీఐ విచారణ - కేంద్రానికి విపక్షాల డిమాండ్ !