VijaySai Reddy Lands Issue :   వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిపై భూ దందా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారని .. ఆ ప్రాంతానికి తగ్గరగానే పెద్ద ఎత్తున ఆయన తన కుమార్తె, అల్లుడి కంపెనీ పేరుపై భూములు కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది కాలంలోనే ఆయన కుమార్తె, అల్లుడు డైరక్టర్లుగా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ గత ఏడాది కాలంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిందన్న ఆరోపణలు రెండు రోజుల నుంచి మీడియాలో వస్తున్నాయి. పలువురు విపక్ష పార్టీల నేతలు ఇవే ఆరోపణలు చేస్తున్నారు.


విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి "  పేరెన్నికగన్న ఆర్థిక నేరగాడు" అని.. విశాఖలో ల్యాండ్ డీల్స్‌పై ప్రధాన మంత్రి తక్షణం సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 



రెండు రోజుల నుంచి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా విజయసాయిరెడ్డి ఇంత వరకూ  ఈ అంశంపై స్పందించలేదు. 





అమరావతిలో రాజధాని వస్తుందని ముందుగా తెలుసుకుని అక్కడ టీడీపీ నేతలు భూములు కొన్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్ అని చెప్పేవారు. అయితే  ఆ విషయాన్ని నిరూపించలేకపోయారు. కానీ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందన్న కారణంతో విజయసాయిరెడ్డి పెద్ద ఎత్తున తన కుమార్తె, అల్లుడితో   భూములు కొనిపించారని.. అసలైన ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. బోగాపురం ఎయిర్ పోర్టు రహదారి అలైన్ మెంట్‌ను కూడా అక్రమంగా మార్చారని అంటున్నారు.


విశాఖలో అనేక రకాల భూదందాలపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో విజయసాయిరెడ్డి కానీ వైఎస్ఆర్‌సీపీ కానీ ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. స్పందించలేదు. కానీ విపక్షాలు మాత్రం సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.