Direct Tax collection: భారత ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగుతోంది. ఒకపైపు వస్తు, సేవల పన్నుల (GST) వసూళ్లు; మరోవైపు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రేసు గుర్రాల్లా దూసుకెళ్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) ఇప్పటివరకు (2022 ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 8 వరకు).. కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ విభాగాల్లో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24 శాతం పెరిగి రూ.8.98 లక్షల కోట్లకు చేరినట్లు పన్ను విభాగం ప్రకటించింది.
ఇన్‌కం టాక్స్, టాన్స్‌ఫర్ టాక్సెస్, ఎన్‌టైటిల్‌మెంట్ టాక్స్, ప్రాపర్టీ టాక్స్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (DDT) సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ టాక్స్ (STT) వంటివాటిని డైరెక్ట్ టాక్సెస్ లేదా ప్రత్యక్ష పన్నులుగా మన దేశంలో వసూలు చేస్తారు.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. వ్యక్తిగత ఆదాయపు పన్ను (సెక్యూరిటీల క్రయవిక్రయాల మీద పన్నులతో కలిపి) విభాగంలో 32 శాతం వృద్ధి నమోదైంది. కార్పొరేట్ పన్ను విభాగంలో వసూళ్లు 16.73 శాతం పెరిగాయి.
నికరంగా రూ.7.45 లక్షల కోట్లు
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసినవారికి సంబంధించిన రిఫండ్లను (రూ.1.53 లక్షల కోట్లు) సర్దుబాటు చేసిన తర్వాత, నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 8 వరకు రూ.7.45 లక్షల కోట్లుగా లెక్క తేలాయని పన్ను విభాగం వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన పన్ను వసూళ్ల లక్ష్యానికి సంబంధించి, బడ్జెట్ అంచనాల్లో (BE) ఇది 52.46 శాతానికి సమానం.
2022-23లో రూ.14.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2021-22లో వసూలైన రూ.14.10 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల కంటే మరో 10 వేల కోట్ల రూపాయలను అధికంగా టార్గెట్‌గా పెట్టుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 8 మధ్య కాలంలో రూ.1.53 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిఫండ్‌లు జారీ అయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం పెరిగింది.
రిఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత, నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16.3 శాతం ఎక్కువ. ఇందులో.. వ్యక్తిగత ఆదాయ పన్నులో 16.25 శాతం (STT సహా); కార్పొరేట్ పన్నులో 16.29 శాతం పెరుగుదల ఉంది.
వసూళ్లు పెరిగినా ఆర్థిక మందగమనం
ఏ దేశానికి సంబంధించైనా, పన్ను వసూలను ఆర్థిక కార్యకలాపాల సూచికగా చూడాలి. పన్ను వసూళ్లు పెరిగాయంటే ఆర్థిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని అర్ధం. మన దేశంలో, పారిశ్రామిక ఉత్పత్తి & ఎగుమతులు మందగించినప్పటికీ పన్నుల వసూళ్లు బాగా పెరిగాయి. దీనికి కారణం కార్పొరేట్ లాభాలు పెరగడం. అవే ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌ను నడుపుతున్నాయి.
సరుకుల ఎగుమతుల్లో, గత ఏడాది కనిపించిన ఉప్పెన లాంటి ఊపు ఇప్పుడు లేదు. సెప్టెంబర్‌లో ఎగుమతులు 3.5 శాతం తగ్గాయి. మొదటి ఆరు నెలల్లో వాణిజ్య లోటు దాదాపు రెట్టింపు అయింది.
పారిశ్రామిక (Index of Industrial Production-IIP) వృద్ధి జులైలో 2.4 శాతానికి తగ్గగా, ఆగస్టులో ‘కోర్ సెక్టార్’ తొమ్మిది నెలల కనిష్ట స్థాయి 3.3 శాతానికి చేరుకుంది.
వస్తువులు, సేవలపై పన్ను (GST) వసూళ్లు నెలకు సగటున దాదాపు రూ.1.45-1.46 లక్షల కోట్లతో ఫ్లాట్‌గా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధిని గతంలో అంచనా వేసిన 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం, విదేశాల నుంచి డిమాండ్ మందగించడం వంటి కారణాలతో భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను ఇతర రేటింగ్ ఏజెన్సీలు కూడా తగ్గించాయి.