Komatireddy Venkat Reddy Munugode Bypolls: తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికలు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఓ వైపు అన్ని రాజకీయ పార్టీలకు ఇది కీలకంగా మారగా.. కోమటిరెడ్డి కుటుంబంలో ఇది ఇబ్బందికరంగా మారింది. 2018 ఎన్నికల్లో కాంగ్రేస్‌ పార్టీ నుంచి మునుగోడు ఎమ్మేల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇద్దరు సోదరులు ఇప్పటి వరకు కాంగ్రేస్‌లో కీలకంగా ఉనప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 


ఆయన సోదరుడు వెంకటరెడ్డి మాత్రం కాంగ్రేస్‌లోనే ఉనప్పటికీ పార్టీ కార్యక్రమాలకు ఇప్పటి వరకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రంలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీలోకి సోదరుడు వెళ్లడం, ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో ఈ విషయం ఉమ్మడి నల్గొండతోపాటు తెలంగాణలోనూ చర్చానీయాంశంగా మారింది. ఈ విషయం ఇలా ఉండగా తాను సూచించిన అభ్యర్థి పాల్వాయి స్రవంతికే కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇవ్వడంతో బిగ్ బ్రదర్ వెంకటరెడ్డి మునుగోడులు పార్టీ ఎన్నికల ప్రచారానికి వస్తాడని అంతా భావించారు. ఈ నెల 14న నామినేషన్‌ కార్యక్రమం ఉండగా, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వెంకటరెడ్డి ప్రచారంలోకి దిగుతాడని స్థానిక నేతలు, అధిష్టానం భావించింది. 
రాహుల్‌ భారత్‌జోడో యాత్రకు వెంకటరెడ్డి..
అటు మునుగోడు ఉప ఎన్నికలతో పాటు రాష్ట్ర పార్టీ చేస్తున్న సమావేశాలకు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రకు వెళ్లి అక్కడ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ నెలాఖరులో తెలంగాణలోకి ప్రవేశించనున్న జోడో యాత్ర సన్నాహాక సమావేశానికి మాత్రం హాజరుకాలేదు. మరోవైపు స్థానికంగా మునుగోడు ఉప ఎన్నికలకు సంబందించి ఏర్పాటు చేసిన సమావేశాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. ఈ క్రమంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారానికి వస్తాడా..? లేదా..? అనేది ఇప్పటి వరకు ఎవరికీ అంతుచిక్కలేదు.


కుటుంబంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్లాన్ 
తాజాగా మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నేరుగా వెంకటరెడ్డిని కలిసి ప్రచారానికి రావాలని, తనను గెలిపించాలని వెంకటరెడ్డిని అభ్యర్థించింది. అయితే అందుకు ఆయన సానుకూలంగా ఉన్నాడని, నోటిఫికేషన్‌ తర్వాత ప్రచారానికి వస్తాడని హామీ ఇచ్చినట్లు స్రవంతి ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు భావించారు. అనూహ్యంగా ఈ నెల 15న కుటుంబ సమేతంగా అస్ట్రేలియా వెళ్లేందుకు వెంకటరెడ్డి సిద్దమయ్యాడని ప్రచారం సాగుతుండటంతో ఎట్టకేలకు సోదరుడికి వ్యతిరేకంగా ప్రచారం సాగించేందుకు వెంకన్న దూరంగా ఉంటున్నాడనే విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది.


మరోవైపు తెలంగాణలో అధికారం సాధించేందుకు ఈ ఉప ఎన్నికలే కీలకం కావడంతో అన్ని పార్టీలు ఆ దిశగా ప్రయత్నాలు సాగించే తరుణంలో కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న వెంకటరెడ్డి వ్యవహర శైలి ఆ పార్టీ నాయకులకు అంతు చిక్కడం లేదు. మరోవైపు ఈ నెల చివర్లో రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనున్న సమయంలో ఆ కార్యక్రమానికి కూడా హాజరుకాకుండా విదేశాలకు వెళ్లేందుకు వెంకటరెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఓ వైపు పార్టీలోనే ఉంటూ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో సీనియర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి దూరం కావడం ఆ పార్టీ ఎలా తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారుతారని ప్రచారం చేయడం, అందుకు అనుగుణంగానే వెంకటరెడ్డి వ్యవహారశైలి ఉండటంతో ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రచారానికి వస్తాడా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.