చెడు వ్యసనాలకు బానిసై భార్యను వేధిస్తున్న భర్తను భార్య హతమార్చింది. భార్య పిల్లలను వదిలేసి నెలల తరబడి ఇంటి నుంచి వెళ్లిపోవడం.. తిరిగి వచ్చి ఆమెను తీవ్రంగా వేధిస్తుండటంతో చివరకు అతడిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. తల్లి, సోదరుడితోపాటు మరో ఇద్దరితో కలిసి అతని కాళ్లు, చేతులు కట్టి కాల్వలో పడేసింది. కాగా నెల రోజులుగా మృతదేహం కూడా లభించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఖమ్మం ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


ఖమ్మం నగరం యూపీహెచ్‌ కాలనీకి చెందిన ఎస్‌కె అన్వర్‌ (33) మహబూబాబాద్‌కు చెందిన సల్మాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అన్వర్‌ చికెన్‌ షాపులో పని చేస్తూ ఉండేవాడు. వివాహం అయిన కొద్ది రోజులకే అతను మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత గంజాయికి కూడా బానిసై తరుచూ భార్యను వేదింపులకు గురి చేసేవాడు. ఒక్కోసారి నెలల తరబడి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి తనంతట తానే ఇంటికి వచ్చేవాడు. ఇదిలా ఉండగా సల్మా తండ్రి చనిపోవడంతో ఆమె తల్లి సాదుఖాన్‌ కూడా సల్మాతోపాటు ఉంటూ కూలి పనులకు వెళ్తుంది.


అత్త ప్రియుడిపై దాడి..


తన కూతురు వద్ద ఉంటూ కూలి పనులకు వెళుతున్న సాదుఖాన్‌ చింతకాని మండలం అనంతసాగర్‌ గ్రామానికి చెందిన బాలాజీతో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబందానికి దారి తీసింది. అయితే అత్త బాలాజీతో ఉండటం నచ్చని అన్వర్‌ అనేక సార్లు ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. చివరకు బాలాజీకి చెందిన ద్విచక్ర వాహనాన్ని కాల్చివేయడంతో పాటు అతనిపై కత్తితో దాడికి దిగాడు. ఈ విషయంపై ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అన్వర్‌ వేదింపులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని భావించిన సల్మా ఆమె తల్లి సాదుఖాన్, సోదరుడు యాకూబ్, బాలాజీ, చిర్రా వెంకన్నలతో కలిసి అతనిని హత్య చేసేందుకు నిర్ణయించింది.


ఈ మేరకు సెప్టెంబర్‌ 30 వ తేదీన రాత్రి మద్యం మత్తులో ఉన్న అన్వర్‌ను యాకూబ్‌కు చెందిన ఆటోలో ఖమ్మం ఎస్సార్‌ గార్డెన్స్‌ సమీపంలోని ఎన్‌ఎస్‌పీ కాల్వ వద్దకు తీసుకొచ్చి అతనిని కాల్వలో పడేశారు. అయితే తన కుమారుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఎస్‌.కె. రహమత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ ప్రారంబించిన పోలీసులు అన్వర్‌ భార్య సల్మా, అత్త సాదు ఖాన్‌లను విచారణ చేయడంతో అసలు విషయం కాస్తా బయట పడింది. తామే అతని కాళ్లు, చేతులు కట్టి సాగర్‌ కాల్వలో పడేసినట్లు అంగీకరించారు. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలించినప్పటికీ ఇప్పటి వరకు మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. నిందితులు తాము చేసిన హత్యను అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


Also Read: Hyderabad: తండ్రిని రోకలిబండతో కొట్టిన కొడుకు, అక్కడికక్కడే మృతి - ఉప్పల్‌లో దారుణం