Munugode Byelection :  తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడి గెలుపోటములు తర్వాత రాజకీయ పరిణామాలకు అత్యంత కీలకం కావడమే దీనికి కారణం. అందుకే రాజకీయ పార్టీలు ఖర్చుకు వెనుకాడటం లేదు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు నుంచే రాజకీయ పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. ఖర్చుకు వెనుకాడకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు అంతా అనధికారికమే. 


పార్టీలో చేరితే లక్షలకు లక్షలే !


మనుగోడు బరిలో ఖర్చులో బీజేపీ, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక వనరులకు లోటు లేదు. మునుగోడులో బీజేపీకి బలం లేకపోవడంతో పూర్తిగా ఆయన వ్యక్తిగత చరిష్మా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదనే ఆధారపడుతున్నారు. వారందర్నీ తనతోపాటు బీజేపీలో చేర్చేందుకు ఆయన ప్రత్యేకమైన కార్యాచరణ ఖరారు చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసి మరీ పార్టీ కండువాలు కప్పుతున్నారన్న విమర్శలు ఇప్పటికే వస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు వారి వారి స్థాయిని బట్టి రూ. పది లక్షలు కన్నా ఎక్కువగానే ముట్టచెబుతున్నారని అంటున్నారు. ఇలా వెళ్లే వారు అత్యధికులు కాంగ్రెస్ పార్టీ కావడంతో టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా.. తమ నేతల్ని సంతలో  పశువుల్ని కొన్నట్లుగా కొన్నారని ఆరోపిస్తున్నారు. 


ఖర్చుకు వెనుకాడకుండా రాజకీయం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి !


బీజేపీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో రాజగోపాల్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. రాజీనామా చేసినప్పటి నుండి నియోజకవర్గంలోనే మకాం వేసి.. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటున్నారు. ఇప్పటిక ఆయన  ఎంత ఖర్చుపెట్టారో చెప్పడం కష్టమని బీజేపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిపోయే సరికి.. అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మిగిలినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆఖరు క్షణంలో నియమితులైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరికలపై గతంలోనూ దృష్టి పెట్టారు. మంత్రి జగదీష్ రెడ్డి పలువురు నేతలకు కండువాలు కప్పారు. రాష్ట్రంలో అధికార పార్టీ కావడంతో వారికి కూడా బాగానే  గిట్టుబాటు అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖర్చు విషయంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి వెనుకబడి ఉన్నారు. 


ఓటుకు రూ. పాతిక వేలు పంచుతారని ఒకరిపై ఒకరు ఆరోపణలు 
 
మునుగోడు ఉపఎన్నిక  సెమీ ఫైనల్ కావడంతో రాజకీయ పార్టీలు ఒకరికొకరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారో చెబుతూ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తున్నారు. వారు చెబుతున్న మాటల్ని బట్టి చూస్తే ఏవరేజ్‌గా ఒక్కో ఓటుకు పాతికవేలు ఖాయమన్నట్లుగా రాజకీయం మారిపోయింది. రూ. ఇరవై వేల కోట్ల కాంట్రాక్ట్ ను బీజేపీ నుంచి తీసుకుని రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని.. ఉపఎన్నిక తీసుకు వచ్చారని కేటీఆర్ ఆరోపించారు.అందుకే ఓటుకు ముఫ్ఫై వేల వరకూ పంచుతారని కేటీఆర్ విమర్శించారు డబ్బుతో రాజకీయం చేస్తోంది టీఆర్ఎస్సేనని.. ఓటుకు రూ. నలభై వేలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని బీజేపీ నేతలు రివర్స్‌లో ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్థికంగా మరీ బలవంతురాలు కాకపోవడంతో పాటు టీఆర్ఎస్, బీజేపీ అధికార పార్టీలు కావడంతో డబ్బు రాజకీయాలన్నీ రెండు పార్టీల మధ్యనే సాగుతున్నాయి.


అధికారికంగా ఖర్చు తక్కువే..!


రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మునుగోడులో చేస్తున్న ఖర్చు పూర్తిగా  అనధికారికం. సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఖర్చు చేయాల్సిన మొత్తం రూ. 40 లక్షలు మాత్రమే. అందుకే సీఎం కేసీఆర్ తమ అభ్యర్థికి రూ. 40లక్షల చెక్ ఇచ్చారు. అయితే మునుగోడు ఉపఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖర్చు మొత్తం వందల కోట్లకు చేరుతుందన్న అంచనా ఉంది. ఎవరెవరు ఎక్కువ ఖర్చు పెడతారన్నది చర్చనీయాంశంగా మారింది చాలా ఎన్నికలను చూశారు కానీ ఈ సారి ఎన్నికలు మాత్రం వారికి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.