YSRCP Observers : దసరాకు అన్ని నియోజకవర్గాలకు వైఎస్ఆర్‌సీపీ తరపున ఓ పరిశీలకుడ్ని నియమిస్తారు. వారు వీరు అనే తేడా లేదు. అన్ని నియోజకవర్గాలకూ పార్టీ నేతల నుంచే పరిశీలకులుగా నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. సీఎం జగన్ కూడా అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలకు ఇదే విషయాన్ని చెప్పారు కూడా. ఇప్పుడు దసరా వెళ్లిపోయింది. ఇప్పుడు పరిశీలకుల నియామకం గురించి పెద్దగా ఎక్కడా స్పందించడం లేదు. ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో పరిశీలకుల నియామకంపై జగన్ పునరాలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వైఎస్ఆర్‌సీపీలో వినిపిస్తోంది
పరిశీలకుల నియామకంపై కసరత్తు చేసి మరీ సైలెంట్ అయిన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ !
వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారే ఇంచార్జులు ఉన్నారు. లేని చోట్ల ఓడిన వారు కొంత మంది.. కొత్తగా నియమితులైన వారు కొంత మంది ఇంచార్జులుగా ఉన్నారు. ఇటీవల నియోజకవర్గాలకు పరిశీలకుడ్ని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించాలని.. నిర్ణయించి జాబితారె డీ చేశారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటారు. ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే.. ఇంచార్జిని ఐ ప్యాక్ టీం ఫాలో చేస్తోంది. వారేం చేస్తున్నారో పరిశీలిస్తోంది. నివేదికలిస్తోంది. అందుకే జగన్... ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడం లేదని జగన్‌కు రిపోర్టులు వెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొత్తగా పరిశీలకుడ్ని నియమించాలని జగన్ అనుకున్నారు. కసరత్తు చేసి మరీ ఆగిపోయారు.
ప్రత్యామ్నాయ నాయకత్వం ఉండాలనుకుంటున్న హైకమాండ్ !
పరిశీలకుల నియామకంగా కొత్త సమస్యలు వస్తాయని కొంత మంది పార్టీ నేతలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీఎం జగన్ మాత్రం నియోజకవర్గంలో ఒకే నేత పెత్తనం ఉండటం వల్ల పార్టీ బలోపేతం కావడం కన్నా.. వ్యక్తిగతంగా లీడర్ బలోపేతం అవుతున్నారని ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం అని భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే పరిశీలకుడు లేదా అదనపు సమన్వయకర్త పేరుతో మరొకరిని ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నారు. ఐ ప్యాక్ టీం కూడా ఈ విషయంపై స్పష్టమైన సూచనలు చేయడంతో జగన్ కూడా అంగీకరించారు. అయితే ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది.
ఎమ్మెల్యేలు, ఇంచార్జుల అసంతృప్తిని కట్టడి చేయలేమనుకున్నారా ?
ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పని చేస్తున్న తమకు పోటీగా మరో పరిశీలకుడ్ని నియమించడంపై ఎమ్మెల్యేలు, ఇంచార్జులు అసంతృప్తి వ్యక్తం చేయడం ఖాయం. తాడికొండకు అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాదరావును నియమించడంతో చెలరేగిన చిచ్చు ఇప్పటికీ ఆరలేదు. నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది. ఇదే పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లో వస్తే అనకున్నదొక్కటి.. అయిందొక్కటి అయిన చందంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలన జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే పరిశీలకుల నియామకం హోల్డ్‌లో పెట్టినట్లే...!