India-UK Trade Deal:


ట్విటర్‌ వేదికగా...


ప్రధాని నరేంద్ర మోదీ...బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు అభినందనలు తెలిపారు. రిషి సునక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఇరు దేశాలకు అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై అందరి దృష్టి పడింది. దీనిపైనా ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. "ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపైనా చర్చించాం. వీలైనంత త్వరగా దీనిపై ఓ నిర్ణయానికి వస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రిషి సునక్ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించారు. "యూకే, భారత్‌ మధ్య సత్సంబంధాలున్నాయి. భద్రత, రక్షణ, ఆర్థిక భాగస్వామ్యంలో రెండు దేశాలు కలిసి భవిష్యత్‌లో ఎలాంటి విజయాలు సాధిస్తాయో చూడాలన్న ఉత్సాహంతో ఉన్నాను" అని ట్వీట్ చేశారు సునక్. FTA విషయంలో ఈ ఏడాది జనవరి నుంచే బ్రిటన్, భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో FTAకి  మద్దతు తెలిపారు సునక్. 










ఎఫ్‌టీఏ ఒప్పందం..


బోరిస్‌ జాన్సన్‌ హయాంలో భారత్‌-బ్రిటన్‌ల మధ్య ఎఫ్‌టీఏ ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే కొన్నాళ్లుగా బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ఉండటంతో ఈ ఒప్పందం సహా ద్వైపాక్షిక సంబంధాలు కూడా కొంత నెమ్మదించాయి. ఈ ఒప్పందంపై జనవరిలో మొదలైన చర్చలు అక్టోబరు లోపు పూర్తవ్వాలి. కానీ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటం, లిజ్‌ట్రస్‌ కేబినెట్‌లో హోం మంత్రిగా పనిచేసిన మరో భారత సంతతి మంత్రి బ్రేవర్మన్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో అది పట్టాలు తప్పింది. వీసాలు పూర్తయినా చాలామంది భారతీయులు యూకేను వీడిపోవటం లేదంటూ భారతీయ ఎంబసీని తప్పు పట్టేలా ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది కూడా! ఆ ఒప్పందాన్ని ఇప్పుడు పట్టాలకెక్కించటం రిషి సునక్ ముందున్న సవాలు.


ఏకగ్రీవంగా ఎన్నిక..


ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెలన్నర క్రితం ప్రధాని ఎన్నికలలో లిజ్ ట్రస్ అతనిని ఓడించారు. అయితే 45 రోజులకే ఆర్థిక సంక్షోభం కారణంగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధాని పదవి రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ తప్పుకోవడంతో రిషి సునక్ ఎన్నిక లాంఛనం అయింది. బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్‌ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునక్‌కు 144 మంది సభ్యుల మద్దతు లభించింది. 


Also Read: Note Photo Controversy: ఇది 130 కోట్ల మంది ఆకాంక్ష, తక్షణమే అమలు చేయండి - కరెన్సీ వివాదంపై ప్రధానికి కేజ్రీవాల్ లేఖ