Elon Musk Twitter Deal: టెస్లా (Tesla) కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ట్విట్టర్‌లో ఆయన ఛార్జ్ తీసుకోగానే సర్‌ప్రైజ్ న్యూస్ బయటకు వచ్చింది. ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్‌తో సహా కొన్ని పెద్ద తలకాయలను ఎలాన్ మస్క్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అమెరికా మీడియా కథనాల ప్రకారం... CEO పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (CFO) చీఫ్ నెడ్ సెగెల్ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు, మళ్లీ తిరిగి రానేలేదట. లీగల్ పాలసీ, ట్రస్ట్, సేఫ్టీ హెడ్ విజయ గద్దెను కూడా మస్క్ బయటకు పంపేశారని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఇంకా కొందరు సీనియర్ అధికారులను కూడా తొలగించారని సమాచారం. ట్విట్టర్‌తో ఎలోన్ మస్క్ ఒప్పందం పూర్తయిన సమయంలో పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్ కార్యాలయంలోనే ఉన్నారని, ఆ తర్వాత వారిని కార్యాలయం నుంచి బయటకు పంపారని కూడా వార్తలు వస్తున్నాయి.
ట్విట్టర్‌ను తాను కొనబోతున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్ 13న ఎలాన్ మస్క్ ప్రకటించారు. అక్కడి నుంచి సినిమా రీల్‌లా ఈ డీల్ కొన్ని మలుపులు తిరిగింది. ఈ ఒప్పందం జరగదు అనుకునే స్టేజ్‌కు కూడా వెళ్లింది. చివరకు సంతకాలు జరిగాయి. ట్విటర్‌కు సంబంధించిన డీల్ ఖరారు చేయడానికి ఒకరోజు ముందు, అంటే గురువారం (అక్టోబర్ 27) రోజున ఎలాన్ మస్క్ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ట్విట్టర్ కొనుగోలు వెనుక తన ఉద్దేశ్యాన్ని వెల్లడించారు. ఇదే కాకుండా, ఈ యాడ్స్ గురించి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డబ్బు సంపాదించడం కోసం ఈ డీల్ జరగలేదు, మానవత్వం కోసం జరిగిదంటూ పేర్కొన్నారు.
గురువారం, ఒక సింక్‌ను మోస్తూ శాన్ ఫ్రాన్సిస్కో లాబీలో ఎలాన్ మస్క్ కలియతిరిగారు. "Entering Twitter HQ – let that sink in!" అన్న క్యాప్షన్‌తో ఆ వీడియోను ట్వీట్ చేశారు.
మొత్తం 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను మస్క్ కొన్నారు. తనను తాను "చీఫ్ ట్విట్" (Chief Twit) అని పేర్కొంటూ తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను మార్చారు. తన లొకేషన్‌ను ట్విట్టర్ ప్రధాన కార్యాలయంగా ప్రొఫైల్‌లో పేర్కొన్నారు.