TRS Politics : "ఫామ్‌హౌస్" వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. బుధవారం రాత్రి ప్రారంభమై గురువారం ఉదయం వరకూ పెను తుఫాన్‌గా మారినట్లుగా కనపించింది. కానీ టీఆర్ఎస్ ఒక్క సారిగా వెనక్కి తగ్గడంతో గురువారం సాయంత్రానికి ప్రశాంతత ఏర్పడింది. కానీ ఇది తుపాను ముందు ప్రశాంతతేనని .. ఈ వ్యవహారంలో బ్లాస్టింగ్ విషయాలు బయట పెడతామని.. బీజేపీ ఢిల్లీ పెద్దల బండారం బయటపెడతామని టీఆర్ఎస్ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. తర్వాత ఏం చేస్తారో కానీ ఇప్పటికైతే సద్దుమణిగింది ఈ విషయంలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గటిల్గు కనపిస్తుంది కానీ ఇప్పటికిప్పుడు ఈ ఎపిసోడ్‌ను ఇంతటితో ఆపేసినా ఆ పార్టీకి ఊహించనంత లాభం కలుగుతుంది. అది అంచనా వేయలేని లాభం. ఈ పద్దతిలో కాకుండా మరో రకంగా సాధించలేని ప్రయోజనం అది. అదే ఫిరాయింపులను నిరోధించడం.
టీఆర్ఎస్‌ను చేరికలు కొంత కాలం ఆగిపోయినట్లే !
తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవలి కాలంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నాయకులు పలువురు బీజేపీ బాట పట్టారు. మనుగోడు ఉపఎన్నిక తర్వాత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. బీజీపీ నేతలే ఈ రకమైన మైండ్‌గేమ్‌కు పాల్పడ్డారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు నాలుగు జిల్లాల నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మునుగోడు ఉపఎన్నికల తర్వాత తమ పార్టీలో చేరుతారని నేరుగానే చెప్పారు. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఫలితం తేడా వస్తే.. ఆ పార్టీ నాయకుల్లో కూడా భవిష్యత్‌పై భయం ప్రారంభమవుతుంది. అదే సమయంలో అక్కడ బీజేపీ విజయం సాధిస్తే వలసల్ని ఆపడం టీఆర్ఎస్ హైకమాండ్‌కు కూడా సాధ్యం కాదు. రాజకీయం పూర్తిగా బీజేపీ వైపు ఉన్న సమయంలో.. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రయత్నిస్తే .. అడ్డుకునేంత సానుకూలత టీఆర్ఎస్ హైకమాండ్‌కు ఉండదు. ఈ విషయంలో బీజేపీ దగ్గర అన్ని రకాల అస్త్రశస్త్రాలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ హైకమాండ్ ఏమీ చేయకుండానే ఎమ్మెల్యేలు ఆగిపోతారు.
బీజేపీలో చేరిన వారి వైపు అనుమానంగా చూసే చాన్స్ !
భారతీయ జనతా పార్టీతో కొంత మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనేది చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మాట. తెలంగాణ నుంచి మరో ఏక్‌నాథ్ షిండే వస్తారని బండి సంజయ్ లాంటి నేతలు చెబుతూ వస్తున్నారు. అలాంటి ప్రయత్నం జరిగిందో లేదో కానీ ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగు చూసింది. అక్కడ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. వంద కోట్ల బేరం జరిగిందని చెబుతున్నారు. అంటే ఒక్కో ఎమ్మెల్యే రూ. వంద కోట్లకు పార్టీ ఫిరాయించబోతున్నారన్న అభిప్రాయానికి జనం వచ్చారు. రేపు ఎవరైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి.. బీజేపీలో చేరితే.. వారు కూడా రూ. వంద కోట్లు తీసుకున్నారా అనే ప్రశ్న మొదటగా వస్తుంది. ఈ నింద భరించడం ఎమ్మెల్యేలకు అంత తేలిక కాదు. టీఆర్ఎస్‌లో టిక్కెట్ రాదని..బీజేపీలో చేరామన్నా.. ఎవరూ నమ్మరు. రూ. వంద కోట్లు అందాయనుకుంటారు.
ఆపరేషన్ ఆకర్ష్‌ను బీజేపీ పక్కకు పెట్టక తప్పని పరిస్థితి !
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు బీజేపీలో చేరినా.. ఆ నేతలపై అనుమానంగా చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత తీసుకున్నారని ప్రశ్నలొస్తాయి. అంతే కాదు.. తమ నియోజకవర్గంలోనూ ఈ రకమైన చర్చ జరుగుతుంది. ఇది పార్టీ మారాలనుకుంటున్న నేతలకు అగ్నిపరీక్ష లాంటిదే. ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధమై బీజేపీతో చర్చలు కూడా పూర్తి చేసిన వారికి ఇబ్బందికర పరిస్థితే. అందుకే చర్చలు పూర్తి చేసుకున్న వారు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇది బీజేపీ నేతలకు ఆశనిపాతమేనని అనుకోవచ్చు. కేసులతో భయపెట్టి.. డబ్బులు ఆశ చూపి బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకుంటుందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే ఇలా ఎప్పుడూ బయటపడలేదు. తెలంగాణలో బయటపడటంతో ఆ పార్టీలో చేరికలకు బ్రేక్ పడినట్లేనని చెప్పుకోవచ్చు.
మునుగోడు ఫలితం ఎలా ఉన్నా.. టీఆర్ఎస్‌కు వలస భయం లేనట్లే !
నిజానికి ఫామ్ హస్ కేసులో బీజేపీ నేతలున్నారని ఎవరూ చెప్పడం లేదు. ఆ స్వామిజీలు బీజేపీ నేతలకు సన్నిహితలని చెబుతున్నారు. నందకుమార్ అటు బీజేపీతో పాటు టీఆర్ఎస్ నేతలకూ సన్నిహితుడే. ఆయన ఫలానా పార్టీ కోసం మధ్యవర్తిత్వం చేశారని ఎవరూ అనుకోవడం లేదు. ఇక్కడ బీజేపీది తప్పు ఉన్నా లేకపోయినా రాజకీయంగా లాభం టీఆర్ఎస్‌కు..నష్టం బీజేపీకి ఇప్పటికే కలిగింది. బీజేపీ నేతలు ఇక నుంచి ఎవరనైనా తమ పార్టీలోకి చేర్చుకోవాలంటే.. ఈ వ్యవహారం సద్దుమణిగిదేకా ఉండాలి. లేకపోతే బేరాలతోనే చేర్చుకున్నారని అంటారు. మొత్తంగా ఈ ఫామ్ హౌస్ వ్యవహారం టీఆర్ఎస్ అధినేతకు పెద్ద చిక్కు తొలగించినట్లయింది.