Note Photo Controversy:


లెటర్ రాసిన కేజ్రీవాల్ 


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కరెన్సీ నోట్లపై చేసిన వ్యాఖ్యలు రెండు రోజులుగా దుమారం రేపుతూనే ఉన్నాయి. రాజకీయంగా పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్...ప్రధాని మోదీకి లేఖ రాశారు. "ఇది దేశంలోని 130 కోట్ల మంది కోరిక. గాంధీ బొమ్మతో పాటు కరెన్సీ నోటుపై లక్ష్మీదేవి, గణేషుడి బొమ్మలు ముద్రించండి" అని లేఖలో పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా దారుణమైన స్థితిలో ఉందని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న పేద దేశంగానే మిగిలిపోయిందని లేఖలో ప్రస్తావించారు. దేశంలో ఇంకా ఇంత మంది పేదలు ఎందుకున్నారని ప్రశ్నించారు. " ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మనమంతా సమష్టిగా శ్రమించాలి. అటు దేవుళ్ల ఆశీర్వాదాన్నీ బలంగా కోరుకోవాలి. ఇవే దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాయి. నేను చెప్పినప్పటి నుంచి ప్రజల్లో ఈ కోరిక బలపడింది. అందరూ ఇది జరగాలని కోరుకుంటున్నారు. తక్షణమే అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు" అని వెల్లడించారు కేజ్రీవాల్.  


మాటల యుద్ధం..


కరెన్సీ నోట్ల వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఆప్, కాంగ్రెస్, భాజపా మధ్య ఇది మాటల యుద్ధానికి దారి తీసింది. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా కేజ్రీవాల్ కామెంట్స్‌పై స్పందిస్తోంది. ఓ భాజపా నేత మాటలు ఎందుకనుకున్నాడో ఏమో. ఏకంగా చేతల్లో చూపించాడు. ఛత్రపతి శివాజీ ఫోటోతో ఇండియన్ కరెన్సీని ఫోటోషాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. భాజపా నేత నితేశ్ రాణే ఈ ఫోటోను షేర్ చేశారు. రూ.200 నోటుపై ఛత్రపతి శివాజీ ఫోటోని ఎడిట్ చేశారు. మహారాష్ట్రలోని కంకవలి ఎమ్మెల్యే అయిన రాణే.."ఇది పర్‌ఫెక్ట్‌"
అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్‌ కామెంట్ చేసినప్పటి నుంచి కరెన్సీ నోట్లపై ఫోటోల విషయంలో పెద్ద వివాదం నడుస్తోంది. కేజ్రీవాల్‌కు ఉన్నట్టుండి హిందూ రాజకీయాలు గుర్తొచ్చాయని భాజపా విమర్శిస్తోంది. ఇదంతా పొలిటికల్ డ్రామా అని కొట్టి పారేస్తోంది. హిందూ దేవుళ్లను ఆప్ ఎన్నో సార్లు కించపరిచిందని, ఇప్పుడు కొత్తగా ఈ నాటకం తెరపైకి తీసుకొచ్చిందని భాజపా నేత మనోజ్ తివారి మండిపడ్డారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన ఆప్...ఇప్పుడు హిందూ కార్డ్‌ పట్టుకుని రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 


అంబేడ్కర్ బొమ్మ వేయాలని..


 కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి దీనిపై స్పందించారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాంధీ బొమ్మ పక్కన అంబేడ్కర్ బొమ్మ ఎందుకు లేదని ప్రశ్నించారు. అహింస, రాజ్యాంగవాదం, సమతావాదం అనే అంశాలు మనలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. ఆధునిక భారత్‌కు ఇదే సరైన ప్రతీక అని అన్నారు తివారి. ఇక భాజపా అయితే...కేజ్రీవాల్‌పై తీవ్రంగా ఫైర్ అవుతోంది. గుజరాత్ ఎన్నికల కోసమే ఆయన "హిందూ కార్డ్‌" రాజకీయాలు చేస్తున్నారని మండి పడుతోంది. నిజానికి...ఇలా కరెన్సీ నోట్లపై బొమ్మలు మార్చేయాలన్న డిమాండ్ గతంలోనూ వినిపించింది. గత వారం Akhil Bharat Hindu Mahasabha (ABHM) కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పింది.


Also Read: Munugode By Elections: మునుగోడు మాజీ ఎన్నికల అధికారిపై వేటు! ఈసీ తక్షణ ఆదేశాలు