India-China Standoff:
19వ రౌండ్ చర్చలు
భారత్ చైనా మధ్య రెండేళ్లుగా సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. గల్వాన్ ఘటనతో మొదలైన అలజడికి తెర పడడం లేదు. పలు సందర్భాల్లో చైనా సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అందుకు భారత్ సైన్యం కూడా గట్టిగానే బదులు చెప్పింది. ఓ వైపు వివాదం కొనసాగుతుండగానే దౌత్యపరమైన చర్చలూ జరుగుతున్నాయి. ఇప్పటికే 18 రౌండ్ల చర్చలు జరగ్గా ఇప్పుడు మరోసారి కమాండర్ స్థాయిలో భేటీ జరగనుంది. ఆగస్టు 14న ఈ చర్చలు జరగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. భారత్ భూభాగంలోని చుషూల్ మాల్దో ప్రాంతంలో ఈ భేటీ జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చల తరవాత భారత్ సైనిక బలగాలను ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌లోని డెస్పాంగ్, డెమ్చోక్ నుంచి బలగాలను వెనక్కి రప్పించే యోచనలో ఉంది. ఇదే సమయంలో చైనాపై భారత్ ఒత్తిడి తీసుకురానుంది. వాస్తవాధీన రేఖ (Line of Actual Control) వద్ద చైనా బలగాలు పదేపదే కవ్వింపులకు పాల్పడటాన్ని ఖండించనుంది. భారత్ తరపున Fire and Fury Corps Commander లెఫ్ట్‌నెంట్ జనరల్ రషీమ్ బాలి చైనా మిలిటరీతో చర్చించనున్నారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధులతో పాటు ITBP కూడా ఈ చర్చలో పాల్గొననున్నట్టు సమాచారం. LAC నుంచి చైనా బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ చర్చలు జరిగాయి.
వివాదానికి ఫుల్‌స్టాప్..
ఇప్పటికే దాదాపు 18 సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. క్రమక్రమంగా బలగాలను ఉపసంహరించుకున్నాయి భారత్, చైనా. కానీ...మధ్యలో మళ్లీ చైనా కవ్వించడం వల్ల భారత్ కూడా పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరించింది. అత్యాధునిక ఆయుధాలనూ సిద్ధం చేసుకుంది. ఎప్పుడు చైనా యుద్ధానికి దిగినా వెంటనే దీటైన బదులిచ్చేందుకు రెడీ అయిపోయింది. అయితే...యుద్ధం వరకూ పరిస్థితులు వెళ్లకుండా చర్చలతోనే వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తోంది భారత్. అందుకే మరోసారి ఆ దేశంతో చర్చలకు సిద్ధమైంది. ద్వైపాక్షిక సంబంధాలనూ దారికి తీసుకురావాలని భావిస్తోంది. అరుణాల్ ప్రదేశ్ విషయంలో చైనా మొండి వాదన మానడం లేదు. పైగా పేర్లు మారుస్తామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ వివాదం ముదురుతున్న క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. ఈ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూభాగంలో అమిత్‌షా పర్యటించి నిబంధనలు ఉల్లంఘించారని మండి పడింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై ఓ నోట్ విడుదల చేసింది. ఈ మధ్యే చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లు మార్చింది. అవన్నీ చైనాలో భాగమే అని తేల్చి చెప్పింది. "జంగ్నన్ (Zangnan) మాదే" అంటూ అరుణాచల్‌కు కొత్త పేరు పెట్టింది.