రక్తదానం చేయడం వల్ల మరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవారవుతాం. అందుకే ఆరోగ్యకరమైన ప్రతి వ్యక్తి రక్తదానం చేయాలని చెబుతారు వైద్యులు. మన రక్తంలో మూడు రకాల రక్త కణాలు ఉంటాయి. వాటిలో ఎర్ర రక్త కణాలు శరీరమంతా ఆక్సిజన్‌ను, పోషకాలను సరఫరా చేస్తాయి. ఇక తెల్ల రక్త కణాలు రక్షక భటుల్లా మన శరీరంలోకి వైరస్‌లు, బ్యాక్టీరియాలు దాడి చేయకుండా కాపాడతాయి. రక్తంలో ఉండే ప్లేట్లెట్లు... గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం అధికంగా జరగకుండా ఆపడానికి ఉపయోగపడతాయి. అలాగే రక్తంలో ప్లాస్మా కూడా ఉంటుంది. ఈ ద్రవపదార్థంలోనే రక్త కణాలన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తానికి చాలా ముఖ్యమైనవి. వీటిలో ఏది లోపించినా సమస్యలు వస్తాయి.


రక్తదానం చేసేవారు కొన్ని రకాల ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ముసలివారు రక్తదానం చేయకూడదు. ఎంతోమందికి రక్తదానం ఎవరు చేయాలో, ఎవరు చేయకూడదు అన్న విషయంలో క్లారిటీ లేదు.


18 ఏళ్లు దాటిన వారు, 65 వయసు దాటని వారు రక్తదానం చేయొచ్.చు అయితే వారు ఆరోగ్యవంతులై ఉండాలి. అలాగే వారి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం 12.5 గ్రాములు కన్నా ఎక్కువగా ఉండాలి. రక్తం ద్వారా వ్యాపించే వ్యాధులయిన హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు. అలాగే బీపీ అధికంగా ఉన్నవారు కూడా రక్తదానం ఇవ్వకూడదు. పల్స్ రేటు సాధారణంగా ఉన్నవారు మాత్రమే రక్తదానం చేయాలి. అలాగే గుండె జబ్బులు ఉన్నవారు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలు ఉన్నవారు రక్తదానానికి దూరంగా ఉండాలి. మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులకు మందులు వాడుతున్న వారు రక్తదానం చేయకపోవడమే మంచిది. థైరాయిడ్ సమస్య ఉన్న వారు థైరాయిడ్ అదుపులో ఉన్న తర్వాతే రక్తదానం చేయాలి. టాటూ వేయించుకున్నాక ఒక ఆరు నెలల వరకు రక్తదానం చేయకపోవడమే మంచిది. ఆ టాటూ వేసిన సూది సురక్షితమైనదో కాదో ఆరు నెలల్లో తెలుస్తుంది.


అలాగే లైంగిక సంక్రమణ వ్యాధులు ఉన్నవారు రక్త దానానికి దూరంగానే ఉండాలి. టీకాలు తీసుకుంటే కొన్ని రోజులు పాటు రక్తదానం చేయకూడదు. ఎల్లో ఫీవర్, మీజిల్స్ వంటి వాటికి టీకాలు తీసుకుంటే నాలుగు వారాల వరకు రక్తదానం చేయకూడదు. ధూమపానం చేసేవారు కూడా రక్తదానం చేయవచ్చు. ఆల్కహాల్ తాగాక మాత్రం రెండు రోజులపాటు రక్తదానం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే రక్తంలో ఆల్కహాల్ కలిసిపోయి ఉంటుంది.


రక్తదానం చేయడం వల్ల దేశంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఏడాది నాలుగు లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ నాలుగు లక్షల రోడ్డు ప్రమాదాల్లో లక్షన్నర మరణాలు నమోదు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా అధిక రక్తస్రావం వల్ల, రక్తం అందక జరుగుతున్నవే. అలాగే ప్రసవం సమయంలో కూడా ఎంతోమంది మహిళల్లో రక్తహీనత సమస్య ఉంటుంది. అలాగే అధిక రక్తస్రావం జరుగుతుంది. వీరికి కూడా రక్తం ఎక్కించడం చాలా అవసరం. తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా జీవితాంతం రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరికీ కూడా రక్తం చాలా అవసరం. ఎవరో ఒకరు దానం చేస్తేనే వీరికి రక్తం అందుతుంది, కాబట్టి ఆరోగ్యవంతులైన ప్రతి వ్యక్తి రక్త దానం చేసేందుకు ముందుకు రావాలి.


Also read: టమోటాలతో పురుషుల్లో పెరుగుతున్న సంతానోత్పత్తి సామర్థ్యం?








































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.