రెండు నెలల క్రితం వరకు టమోటో లేనిదే ఏ కూర పూర్తయ్యేది కాదు, కానీ గత రెండు నెలల నుంచి టమోటో ధరలు కొండెక్కడంతో చాలామంది వాటిని కొనడం మానేశారు. అయితే ప్రతిరోజూ టమోటాలు తినే పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని చెబుతోంది ఒక అధ్యయనం. టమోటాలలో ఉండే లైకోపీన్ అనే పోషకమే పురుషుల్లో వీర్యం నాణ్యతను పెంచుతుందని ఈ అధ్యయనం వివరిస్తోంది. పురుషులు రోజూ రెండు చెంచాల టమాట జ్యూస్‌ను తీసుకుంటే చాలు, లేదా టమాటోను నేరుగా తిన్న మంచిదే. వారి వీర్యం నాణ్యత పెరిగి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా పుట్టే అవకాశం ఉంది.


ప్రపంచంలో పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న దంపతుల సంఖ్య అధికంగానే ఉంది. పురుషుల్లో కూడా ఉన్న కొన్ని సమస్యల వల్ల పిల్లలు పుట్టడం లేదు. ఇలా సంతానోత్పత్తి సమస్యలు ఉన్న పురుషులపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. వారికి సంతానాన్ని కలగకుండా చేసే కారకాలను కనిపెట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. అలాగే వారి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే విషయాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న పురుషులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటు మంచి జీవనశైలిని అనుసరించాలని చెబుతున్నారు వైద్యులు. అలాగే లోదుస్తులు బాగా బిగుతుగా ఉండేవి వేసుకోకూడదని, వదులుగా ఉండే వాటినే ధరించాలని చెబుతున్నారు.


గర్భం దాల్చే అవకాశాలు పెరగాలంటే... స్త్రీ పురుషలిద్దరూ ఒత్తిడిని తగ్గించుకొని తరచూ లైంగిక చర్యలో పాల్గొనాలని వివరిస్తున్నారు. ఇక పురుషుల్లో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తగ్గించే ఆహారంపై కూడా విస్తృతంగా అధ్యయనం చేశారు. అందులో విటమిన్ ఇ, జింక్ లాగే లైకోపీన్ కూడా మంచి యాంటీ యాక్సిడెంట్‌లా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.


ఈ అధ్యయనంలో భాగంగా 60 మందికి లైకోపీన్ సప్లిమెంట్లను ఇచ్చి అధ్యయనం నిర్వహించారు. 12 వారాలపాటు ట్రయల్స్ జరిగాయి. ఆ తర్వాత వారి వీర్యాన్ని పరీక్షించారు. మరింత చిక్కదనం కనిపించింది, అంటే లైకోపీన్ తీసుకున్న తర్వాత వీర్యకణాలు ఆరోగ్యంగా ఎదగడంతోపాటు వాటి సంఖ్య కూడా పెరిగింది. అలాగే  అవి కదిలే చలనశీలత కూడా మెరుగుపడినట్టు వారు గుర్తించారు. కాబట్టి పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులు రోజూ రెండు స్పూన్ల టమోటో జ్యూస్‌ను తాగితే ఎంతో మంచిది. 


ఆహారం రూపంలో కూడా టమోటోలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పిల్లలు, పెద్దలూ ఇద్దరూ టమాటోలను తరచూ తినాలని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఏవైనా కూడా మితంగా తింటేనే ఆరోగ్యం అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.


Also read: మా అమ్మ వల్ల అత్తారింట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి, ఆమెకు చెప్పడం ఎలా?







































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.