ప్రశ్న: నాకు పెళ్లయి ఐదేళ్లు అవుతుంది. నేను మా అత్తగారింట్లోనే ఉంటున్నాను. నా భర్తతో పాటు మా అత్తమామలు కూడా మాతోనే ఉంటారు. నిజం చెప్పాలంటే మా అత్తగారింట్లో నాకు ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఎందుకో మా అమ్మ... నేను మా అత్తగారింట్లో ఎంతో కష్టపడుతున్నానని అనుకుంటుంది. నేను అమాయకురాలినని అత్తారింట్లో పనులన్నీ నేనే చేయాల్సి వస్తోందని భావిస్తోంది. దీంతో మా ఇంటికి వచ్చినప్పుడు మా అత్తగారితో ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకుంటుంది. మా అత్తకి నాకు ఎలాంటి గొడవలు లేవు. కేవలం మా అమ్మ వల్లే మాకు గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మా అమ్మ, నా భర్తతో కలిసి విడిగా కాపురం పెట్టమని చెబుతోంది. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. మా అత్త నన్ను బానే చూసుకుంటుంది. నేను చక్కగా ఉన్నానని, ఆనందంగా ఉన్నానని చెప్పినా మా అమ్మ నమ్మడం లేదు. నువ్వు అమాయకురాలివి అంటూ పదేపదే అంటుంది. కేవలం ఆమె వల్లే నాకు మా అత్తారింట్లో ఇబ్బందులు వస్తున్నాయి. అంతకుమించి నా జీవితంలో ఇంకే కష్టము, లోపము లేదు. నా భర్త కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ మా అమ్మ ఎందుకు ఇంత నెగిటివ్‌గా ఆలోచిస్తుందో అర్థం కావట్లేదు. ఆమెను వదులుకోలేకపోతున్నాను. అలాగే మా అత్తగారు కుటుంబాన్ని కూడా వదులుకోలేను. నేను వారితోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను. కానీ మా అమ్మ ప్రతిసారీ గొడవలు పెట్టుకుంటూ మా అత్తకు, నాకూ దూరాన్ని పెంచేస్తోంది. ఆమెను ఎలా మార్చాలో చెప్పండి.
జవాబు: మీ ఇంట్లో అత్తా కోడలు ఇద్దరూ చక్కగా కలిసి ఉండడం ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే చాలా కుటుంబాల్లో అత్తా కోడలికి మధ్య విభేదాలు వస్తుంటాయి. కానీ మీ ఇంట్లో అలాంటివి ఏమీ లేవు. కాబట్టి మీ ఇల్లు కచ్చితంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మీ అమ్మగారు ఎందుకిలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆవిడకు మీ అత్తగారితో మీరు కలిసి ఉండడం ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. అందుకే వేరు కాపురం పెట్టమని చెబుతోంది. అలాగే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచినట్టు అర్థం అవుతుంది. కోడలిగా అడుగు పెట్టాక అత్తగారు, మామగారు పనులు కూడా మీరు చేయాల్సి వస్తుంది. ఆ విషయం గురించి ఆమె ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. భర్తకు తప్ప అత్తమామలకు పని చేయాల్సిన అవసరం లేదని ఆమె భావించడం వల్లే మిమ్మల్ని వేరు కాపురం పెట్టమని చెబుతున్నట్టు అర్థమవుతుంది.
అత్తగారింట్లో అడుగు పెట్టాక మీ తల్లి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో మీరు చెప్పలేదు. ఆమె ఒకవేళ ఎక్కువగా బాధపడే సందర్భాలను ఎదుర్కొని ఉంటే అవే మనసులో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారేమో ఆ విషయాన్ని మీరు ఆమెతోనే నేరుగా మాట్లాడండి. అలాగే మీ అత్తగారికి దూరంగా ఆమెను ఉంచడం మంచిది. ఎందుకంటే ఇంతవరకు మీ అత్తగారితో మీకు ఎలాంటి సమస్య లేదు. కేవలం మీ అమ్మగారి కారణంగా దూరం పెరిగితే... ఆ దూరం తగ్గడం కష్టం. కాబట్టి వీలైనంతవరకు మీ ఇంటికి మీ అమ్మగారిని ఆహ్వానించడం తగ్గించండి. ఆమె పద్ధతి మార్చడానికి మీరే మీ పుట్టింటికి వెళ్లి ఆమెతో మాట్లాడుతూ ఉండండి. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె ముందు ఎక్కువ పనులు చేస్తూ కనిపించకండి. కొంతమంది తల్లులు అత్తా, మామ గారికి టీ పెట్టి ఇచ్చినా కూడా అది చాలా పెద్ద పని గానే భావిస్తారు. అందుకే మీ తల్లిగారు వేరే కాపురం పెట్టమని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు కనిపిస్తోంది. మీ అమ్మ ఎంత చెప్పినా మేము అమ్మగారిలో మార్పు రాకపోతే మీ బంధువులు సాయం తీసుకోండి. మీ బంధువులకు ముందుగా మీరు మీ అత్తగారింట్లో ఎంత సంతోషంగా ఉన్నారో వివరించండి. అదే విషయాన్ని మీ తల్లికి చెప్పించండి. అన్ని కుటుంబాలు ఒకేలా ఉండవని కోడళ్లను కూతుళ్లులా చూసే అత్తలు కూడా ఉంటారని వివరించండి. మీ అమ్మగారు ఎందుకిలా నెగిటివ్‌గా మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆమె తన జీవితంలో అత్తగారింట్లో పడిన కష్టాలను అడిగి తెలుసుకోండి. అందరూ అలా ఉండరని ఆమెకు వివరించండి. మీరు మాత్రం మీ అత్తగారిని మామగారిని వదిలి బయటకు వెళ్ళకండి. ఒక్కసారి దారం తెగితే దాన్ని ముడివేసి కలపగలమే కానీ, తిరిగి సాధారణంగా అతికించలేం. ఆ ముడి ఎప్పటికీ ఒక లోపంలా కనిపిస్తూనే ఉంటుంది. ఆ లోపాలు మీ జీవితంలో రాకుండా చూసుకోండి.
Also read: పుట్టుకతోనే కొందరిలో గుండెల్లో రంధ్రాలు ఎందుకు వస్తాయి?