Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కేంద్ర ప్రభుత్వ ఖజానాలోకి నిధుల రాక బాగా పెరిగింది. పన్నుల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ సంపాదించిన ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంతో (2022-23) పోలిస్తే, ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (direct tax collection) 15.7 శాతం పెరిగాయి. ఇది, ఈ నెల 10వ తేదీ వరకు ఉన్న లెక్క.
2023-24లో కేంద్ర ఖజానా అంచనాలు
డైరెక్ట్ టాక్స్ వసూళ్ల గురించి శుక్రవారం (11 ఆగస్టు 2023) అధికారిక గణాంకాలు విడుదలయ్యాయి. ఆ లెక్కల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, ఆగస్టు 10 వరకు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యక్ష పన్నుల ద్వారా మొత్తం రూ. 6.53 లక్షల కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలోని ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాల కంటే ఇది 15.7 శాతం ఎక్కువ.
నికర (net) ప్రాతిపదికన, అంటే పన్ను చెల్లింపుదార్లకు జారీ చేసిన టాక్స్ రిఫండ్‌లను తీసివేస్తే, వచ్చిన మొత్తం డబ్బు రూ. 5.84 లక్షల కోట్లుగా ఉంది. నికర ప్రాతిపదికన కూడా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగాయి, అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 17.33 శాతం వృద్ధి చెందాయి. ఈ సంఖ్య, మొత్తం ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలో (BE) 32.03 శాతానికి సమానం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో 32 శాతానికి పైగా డబ్బు ఆగస్టు 10 నాటికే ఖజానాకు చేరింది.
గతంలో కంటే ఎక్కువ రిఫండ్‌లు జారీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదార్లకు ఎక్కువ టాక్స్ రిఫండ్స్ (Tax Refund) జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 10 వరకు, టాక్స్ పేయర్లకు మొత్తం రూ. 0.69 లక్షల కోట్లను ప్రభుత్వం వెనక్కు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జారీ చేసిన రిఫండ్‌ల కంటే ఇది 3.73 శాతం ఎక్కువ.
గత ఆర్థిక సంవత్సరంలో పెరుగుదల
గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల మొత్తం వసూళ్లు 20 శాతానికి పైగా పెరిగి రూ. 19.68 లక్షల కోట్లకు చేరాయి. అవి స్థూల వసూళ్లు. వాటిలో... కార్పొరేట్ టాక్స్ ద్వారా రూ. 10.04 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారా రూ. 9.60 లక్షల కోట్లు వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ కార్పొరేట్ టాక్స్ కలెక్షన్స్‌లో 16.91 శాతం, గ్రాస్ ఇండివిడ్యువల్ ఇన్‌కమ్ టాక్స్ వసూళ్లు 24.23 శాతం పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: కష్టకాలంలో నష్టాలను తగ్గించే మంత్రమిది - ఇన్వెస్టర్లు చాలా డబ్బు సంపాదించారు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial