Hybrid Mutual Funds: ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్లు ఓవర్‌ స్పీడ్‌తో పైకి వెళ్తున్నాయి, అదే స్పీడ్‌తో కిందకు వస్తున్నాయి. ఫైనల్‌గా, చిన్న ప్లేయర్లను చిత్తుగా ఓడించి నడిబజార్లో నిలబెడుతున్నాయి. ఈ ఏడాదిలోని తొలి ఏడు నెలల్లో (జనవరి-జులై), స్టాక్‌ మార్కెట్ 52 వారాల కొత్త గరిష్టం, కొత్త కనిష్ట రెండింటినీ క్రియేట్‌ చేసింది. మార్కెట్లో ఉన్న ఈ అస్థిరత వల్ల హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌కు డిమాండ్‌ పెరిగింది. 


ఈ ఏడాది మార్కెట్‌ తీరు ఇలా ఉంది
BSE ఇండెక్స్‌, ఇవాళ (శుక్రవారం, 11 ఆగస్టు 2023) 65,400 స్థాయిని కూడా కోల్పోయింది. జులై నెలలో, 67,620 పాయింట్ల వద్ద 52 వారాల కొత్త గరిష్ట స్థాయిని తాకింది. మార్చి నెలలో, 56,000 స్థాయికి పడిపోయింది, 56,147 దగ్గర 52-వారాల కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ విధంగా సెన్సెక్స్‌లో 11-12 వేల పాయింట్ల మేర కుదుపులు కనిపించాయి. సెన్సెక్స్‌ రిటర్న్స్‌ చూస్తే... ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ సూచీ దాదాపు 7% లాభాల్లో ఉంది.


మార్కెట్‌ను ఓవర్‌టేక్‌ చేసిన హైబ్రిడ్ ఫండ్స్
ఈ ఏడాదిలో, వివిధ హైబ్రిడ్ ఫండ్స్ పనితీరు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ ఫండ్, నిప్పాన్ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్ వంటి ఫండ్స్‌ ఈ ఏడాది కాలంలో వరుసగా 16.43 శాతం, 18.74 శాతంతో స్ట్రాంగ్‌ రిటర్న్స్‌ ఇచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ మల్టీ అసెట్ ఫండ్, టాటా మల్టీ అసెట్ ఫండ్ రాబడులు వరుసగా 13.98 శాతం, 15.25 శాతం లాభాలను పంచాయి. బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో... ICICI ప్రుడెన్షియల్, సుందరం వరుసగా 10.94%, 11.06% రాబడి తీసుకొచ్చాయి. నిప్పాన్ ఇండియా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ 11.29% రిటర్న్‌ ఇచ్చింది. 


ఇన్వెస్టర్లకు రిటర్న్స్‌ ఇచ్చే రేస్‌లో, ఓవరాల్‌ మార్కెట్‌ను హైబ్రిడ్ ఫండ్స్‌ ఓవర్‌టేక్‌ చేశాయి. స్టాక్ మార్కెట్ల అస్థిరత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఆందోళనలన కారణంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్లు హైబ్రిడ్ ఫండ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.


ఈ ఫండ్స్‌ వల్ల చాలా ప్రయోజనాలు     
హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ & డెట్ రెండింటిలోనూ, కొన్ని సందర్భాల్లో బంగారం, వెండి వంటి కమొడిటీస్‌లోనూ పెట్టుబడి పెడతాయి. అంటే హైబ్రిడ్ ఫండ్‌లో పెట్టే ఒకే పెట్టుబడితో.. విభిన్నమైన పోర్ట్‌ఫోలియో బెనిఫిట్స్‌ లభిస్తాయి. డైవర్సిఫైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజీ కారణంగా హైబ్రిడ్ ఫండ్స్‌ స్థిరమైన, బ్యాలెన్స్‌డ్‌ రిటర్న్స్‌ అందిస్తాయి. రిస్క్‌ కూడా తక్కువగా ఉంటుంది. 


మరో ఆసక్తికర కథనం: డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను ఇలా సబ్మిట్‌ చేయండి, లేకపోతే పెన్షన్ ఆగిపోతుంది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.