Digital Life Certificate: ప్రతి నెలా ఆగకుండా పెన్షన్ రావాలంటే, పెన్షనర్లు నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్ (తాము జీవించే ఉన్నట్లు ధృవీకరణ) సమర్పించాలి. దీనివల్ల, మీకు పెన్షన్ ఇవ్వడం కంటిన్యూ చేయాలని పెన్షన్ ఫండ్ జారీ చేసే సంస్థకు అర్ధం అవుతుంది. ఒకవేళ పెన్షనర్ వయస్సు 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే (సూపర్ సీనియర్ సిటిజన్), ఆ వ్యక్తి అక్టోబర్ నెలలోనే జీవిత ధృవీకరణ పత్రం (Life Certificate) సబ్మిట్ చేయాలి. ఈ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తేనే పెన్షన్ డబ్బు బ్యాంక్ ఖాతాలోకి డిపాజిట్ అవుతుంది.
దేశంలో ఉన్న 70 లక్షల మందికి పైగా ఉన్న పెన్షనర్ల ప్రయోజనం కోసం, 'డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 2.0'ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద, కొత్త గైడ్‌లైన్స్ జారీ అయ్యాయి.
ఈ క్యాంపెయిన్ నవంబర్ 1 నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగుతుంది. 100 నగరాల్లో 50 లక్షల మంది పింఛనుదార్లను కవర్ చేసేలా ఈ ప్రచారం నిర్వహిస్తారు. ముఖ్యంగా, అనారోగ్యం వల్ల లేదా ఇతర కారణాల వల్ల బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న సూపర్ సీనియర్లు ఈ క్యాంపెయిన్ నుంచి బెనిఫిట్ పొందుతారు. ప్రభుత్వం, బ్యాంకు, యూనియన్ అధికార్లు సూపర్ సీనియర్ల ఇంటికే వెళ్లి సర్వీసు అందిస్తారు.
ఫేస్ అథెంటికేషన్ అంటే ఏంటి?
ప్రతి సంవత్సరం దాదాపు 70 లక్షల మందికి పైగా పింఛను తీసుకుంటున్నారు. దీనిని ధృవీకరించడానికి ముఖ ప్రమాణీకరణ (ఫేస్ అథెంటికేషన్) ఫెసిలిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు, పెన్షనర్ తన ఇంట్లోనే కూర్చుని, తన స్మార్ట్ ఫోన్ నుంచి ఈ ఫెసిలిటీని పొందొచ్చు. దీనికోసం, పెన్షనర్ స్మార్ట్ ఫోన్‌లో 'ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్' (Aadhaar faceRD App) ఉండాలి. ఇది అఫీషియల్ యాప్, దీనిని ఉడాయ్ (UIDAI) లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా, ఆధార్ కార్డ్ హోల్డర్ ఎక్కడి నుంచయినా ఫేస్ అథంటికేషన్ పూర్తి చేయొచ్చు. పెన్షనర్ మొబైల్ ఫోన్‌లో ఈ సర్వీస్ యాప్ ఉంటే చాలు.. ఫోన్ ద్వారా ఫేస్ స్కానింగ్‌తో ఆధార్ అథంటికేషన్ కంప్లీట్ అవుతుంది.
ఇంట్లో కూర్చొనే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఎలా పూర్తి చేయాలి?
ముందుగా, మీ స్మార్ట్ ఫోన్‌లో ఆధార్ ఫేస్ RD యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి
ఫ్యామిలీ లేదా రిటైర్మెంట్ పెన్షన్ కోసం లైఫ్ సర్టిఫికేట్ పెన్షన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి
యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించాలి
ఇందులో మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి
ఇప్పుడు, మీ ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను (OTP) ఎంటర్ చేయాలి
ఆ తర్వాత మీరు పేరును ఎంటర్ చేయాలి
గుర్తింపు తర్వాత, సిస్టమ్ మీ ముఖాన్ని స్కాన్ చేస్తుంది
ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీకు నోటిఫికేషన్ రూపంలో సమాచారం అందుతుంది
ఉడాయ్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌ను గత ఏడాది జులైలో లాంచ్ చేసింది. ఈ యాప్ వల్ల కేవలం పెన్షనర్లకు మాత్రమే కాదు, ఆధార్ యూజర్లు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. యూఐడీఏఐ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్‌తో పాటు, స్కాలర్‌షిప్ స్కీమ్స్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పథకాల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఇంటి రుణంపై ఫ్లోటింగ్ రేట్ నుంచి ఫిక్స్‌డ్ రేట్‌కు మారే అవకాశం, ఇది కదా గుడ్‌న్యూస్ అంటే!
.Join Us on Telegram: https://t.me/abpdesamofficial