ఈ రోజు ఒక ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 నుంచి 5.8 కిమీ మధ్యలో ఏర్పడిందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం (ఆగస్టు 11) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ / వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. 


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 71 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు. 


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.


‘‘రుతుపవనాల ప్రభావం ఈ సంవత్సరం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. విస్తారంగా భారీ నుంచి అతిభారీ పడాల్సిన చోట్లల్లో ఇప్పుడు కేవలం అక్కడక్కడ మాత్రమే పరిమితం అవుతోంది. కానీ నేడు మాత్రం కాస్తంత వర్షాలు పెరగడం మనం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో గమనించగలం. రానున్న 24 గంటల వ్యవధిలో - తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగనుంది. అన్నమయ్య​, కడప​, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయే తప్ప విస్తారంగా మాత్రం ఉండవు. కర్నూలు, నంధ్యాల జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల నేడు సాయంకాలం సమయంలో వర్షాలను చూడగలం.


మధ్య ఆంధ్ర జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు ఉంటాయే తప్ప విస్తారంగా ఉండవు. నేడు అర్ధరాత్రి సమయం, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మరోసారి వర్షాలు పడే అవకాశాలు మధ్య ఆంధ్ర జిల్లాల్లో కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు సాయంకాలం సమయంలో వర్షాలను, పిడుగులను చూడగలం. నేడు సాయంకాలం సమయంలో జిల్లాలైన అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు । పిడుగులు ఉంటాయి. విశాఖలో నేడు పశ్చిమ భాగాలు । నగర శివారు ప్రాంతాల్లో మాత్రమే వర్షాలుంటాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.