కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదని.. కోవిడ్ మహమ్మారి నుంచి మనం ఇంకా బయటపడలేదని  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. 



స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కృషివల్లే కరోనా రెండో దశ వ్యాప్తపై పైచేయి సాధించగలుగుతున్నామని చెప్పారు. వ్యాపారులు, వలసదారులపై కరోనా ప్రభావం పడిందని చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల అద్భుతంగా రాణించారని.. ఈసారి ఎక్కువ పతకాలు సాధించి సత్తా చాటారని కొనియాడారు.


దేశ ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయమని రాష్ట్రపతి పేర్కొన్నారు.  ప్రజల శ్రేయస్సు కోసం చర్చించి, సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉన్న ఏకైక వేదిక అని చెప్పారు.  


రాష్ట్రపతి ఇంకా ఏమన్నారంటే..


75 ఏళ్ల ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోదగ్గ దూరం ప్రయాణం చేశామనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. తప్పుడు మార్గంలో వేగంగా ప్రయాణించడం కంటే సరైన మార్గంలో నెమ్మదిగా, స్థిరంగా అడుగులు వేయడం మంచిదని గాంధీజీ మనకు బోధించారు.

కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించాం. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యారు.. ఆ రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశాం. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు.  ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.  మన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో టీకాలను అభివృద్ధి చేయడంలో విజయవంతమయ్యారు.  కరోనా  వైరస్‌ నుంచి రక్షించుకొనేందుకు వ్యాక్సిన్లు రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి. అందరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. తోటి వారు వేసుకునేలా ప్రోత్సహించాలి. టీకాలు వేసుకున్నామని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మరిన్ని జాగ్రత్తలు పాటించాలనేదే ఈ మహమ్మారి మనకు నేర్పిన పాఠం. వైరస్‌ తీవ్రత తగ్గినప్పటికీ కరోనా ఇంకా పోలేదు.


ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు


దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ సిద్ధాంతాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి  తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను మనమంతా స్మరించుకోవాలని చెప్పారు.


Also Read: Independence Day 2021: ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో దిల్లీ వెళ్లకుండానే మీరూ పాల్గొండి.. ఆ పూర్తి వివరాలు మీ కోసమే