అది 1965వ సంవత్సరం.. ముంబయి నగరం ప్రశాంతంగా నిద్రపోతోంది. కానీ, ఓ రోజు ఉదయం.. రోడ్లపై శవాలు కనిపించాయి. అప్పటి నుంచి ప్రతి రోజూ ఏదో ఒక చోట శవం ప్రత్యక్షమయ్యేది. మనుషుల నుంచి జంతువుల వరకు.. ఏదో ఒక కళేబరం కనిపిస్తూనే ఉండేది. దీంతో ప్రజలకే కాదు.. ముంబయి పోలీసులకు కూడా నిద్ర కరవైంది. ఏదో శక్తి ప్రజలను చంపేస్తుందనే ప్రచారం సాగింది. రాత్రయితే ప్రజలు బయటకు రావాలంటేనే భయపడేవారు. కానీ.. ఉదయం చూసేసరికి ఏదో ఒక హత్య వార్త వినాల్సి వచ్చేది. తల లేని మొండెం లేదా ఛిద్రమైన శరీరాలు ఇలా.. ఏదో ఒకటి బయటపడేది. ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేసేవారు? ఒకరా? ఇద్దరా? లేదా ఏదైనా గ్యాంగ్ హస్తం ఉందా?
1965లోనే లాక్‌డౌన్: ముంబయి నగరానికి లాక్‌డౌన్‌లు కొత్త కాదు. అయితే, కరోనా రాకముందే ముంబయిలో 1965 సంవత్సరంలో లాక్‌డౌన్ విధించారు. అయితే, వైరస్‌కు భయపడి కాదు.. సీరియల్ కిల్లర్ నుంచి ప్రజలను రక్షించేందుకు. హంతకుడు ఎక్కువగా మురికివాడల్లో నివసించే ప్రజలనే టార్గెట్ చేసుకొనేవాడు. అనాథలు, రోడ్డు పక్కన నిద్రపోయే నిరాశ్రయులను అత్యంత దారుణంగా చంపేవాడు. ఆ హత్యలను చూస్తే.. అతడికి కొంచెం కూడా కనికరం లేదేమో అనిపించేవి. పోలీసులు రాత్రివేళ కర్ఫ్యూ విధించినా సరే.. ఆ కిల్లర్ దొరికేవాడు కాదు. హత్యలు మాత్రం జరుగుతూనే ఉండేవి.
ఏడాది పాటు వరుస హత్యలు: హత్య జరిగిన ప్రాంతాల్లో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరికేది కాదు. హత్యల తీరును చూస్తే ఏదో బలమైన కడ్డీ లేదా సుత్తితో మోది హత్యలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో అప్పటి డీసీపీ రమాకాంత్ కులకర్ణి హత్యలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. హత్యల తీరును చూసి ఒక్కడే ఈ హత్యలు చేస్తున్నారని తెలుసుకున్నారు. అయితే, అతడిని చూశామని చెప్పే ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా లభించలేదు. 1965 నుంచి 1966 వరకు ఈ హత్యల పరంపర సాగింది.
ఏడాది విరామం తర్వాత: హంతకుడు ఎక్కువగా సెంట్రల్ రైల్వేలోని తూర్పు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ హత్యలు జరిగేవి. అయితే, సుమారు ఏడాదిపాటు.. హత్యలేవీ చోటుచేసుకోలేదు. దీంతో ముంబయి ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. హంతకుడి చనిపోయి ఉంటాడని లేదా వేరే చోటుకు వెళ్లి పోయి ఉంటాడని భావించారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి జరుగుతున్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ తరహాలో మరోసారి హత్యలు మొదలయ్యాయి. 1968 సంవత్సరంలో ఆ సీరియల్ కిల్లర్ మరోసారి నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే, ఈ సారి తూర్పు వైపు కాదు, ఉత్తరం వైపు శివారు ప్రాంత ప్రజలను హంతకుడు టార్గెట్ చేసుకున్నాడు.
ప్రత్యేక సాక్షి దొరికినా..: పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. అనుమానితులను సైతం అరెస్టు చేసి కొద్ది రోజులు జైల్లో పెట్టారు. కానీ, హత్యలు మాత్రం ఆగలేదు. ఇంకా కొనసాగతూనే ఉన్నాయి. అలాంటి సమయంలో పోలీసులకు ఓ అవకాశం దక్కింది. కార్తిక అనే మహిళ ఆ కిల్లర్ దాడి నుంచి తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ నిరాశ్రయ వ్యక్తి తనపై దాడికి ప్రయత్నించాడని పేర్కొంది. అయితే, అతడే దాడి చేశాడని చెప్పేందుకు తగిన సాక్ష్యాలు లభించకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోలేదు. దీంతో ఆ కిల్లర్ మరింత రెచ్చిపోయాడు.
అతడు.. రమణ్ రాఘవ?: చివరికి వరుస హత్యల నేపథ్యంలో డీసీపీ రమాకాంత్ కులకర్ణి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొనేందుకు కార్తికాను విచారించారు. అతడి స్కెచ్ గీయించారు. అతడి బొమ్మను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అప్పటికే ముంబయిలో సుమారు 41 మంది హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అలెక్స్ ఫియాల్హో.. ఆ స్కెచ్‌ను గుర్తుపట్టాడు. అతడు ఓ కేసులో అరెస్టయిన పాత నేరస్తుడు ‘రమణ్ రాఘవ’.
చివరికి దొరికిపోయాడు: త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని అలెక్స్ ఉన్నతాధికారులకు తెలిపాడు. చెప్పినట్లే అలెక్స్ అనుమానితుడు రమణ్‌ను అరెస్టు చేశాడు. అతడు నివసిస్తున్న ఇంట్లో హత్యలకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా కనిపించలేదు. సోదాల్లో పోలీసులకు ఒక జత కళ్లజోళ్లు, రెండు దువ్వెనలు, రెండు కత్తెరలు, ఒక సబ్బు పెట్టే, అల్లం, టీ పొడి, రెండు పేపర్లు మాత్రమే కనిపించాయి. హత్యలకు ఉపయోగించిన ఆయుధం కనిపించలేదు. కానీ అతడు దుస్తులపై ఉన్న రక్త మరకలను పరిశీలిస్తే.. అతడి దాడిలో చనిపోయిన ఓ వ్యక్తి రక్తంతో సరిపోలాయి. అతడి వేలి ముద్రలు సైతం సంఘటన స్థలంలో లభించిన ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు చేసిన హత్యలన్నీ రామణ్ చేసినవేనని పోలీసులు నిర్ధరించారు.
Also Read: లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. ఒక్క రాత్రిలో రూ.437 కోట్లకు అధిపతి అయ్యాడు!
కోడి కూర తిని.. నేరాన్ని అంగీకరించాడు: 40 పైగా హత్య కేసుల్లో అతడు నిందింతుడుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అయితే, రామణ్ మాత్రం నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు అతడితో నిజం కక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. దీంతో అతడు ఆ హత్యలు ఎందుకు చేశాడనేది మిస్టరీగా మిగిలిపోయింది. పోలీసులతో చావు దెబ్బలు తిన్న కొన్ని వారాల తర్వాత రమణ్ నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు ఓ షరతు పెట్టాడు. తనకు కోడి కూరతో లంచ్ పెడితే.. అన్నీ చెబుతానని తెలిపాడు. దీంతో పోలీసులు అతడికి కోడి కూర వడ్డించారు. కోడి కూరతో భోజనం పూర్తయిన తర్వాత.. ‘‘మీకు ఏ వివరాలు కావాలో అడగండి చెబుతా’’ అని పేర్కొన్నాడు. చివరికి.. 41 మందిని హత్య చేశానని నేరాన్ని అంగీకరించాడు.
Also Read: వింత దంపతులు.. అడవిలో నగ్నంగా అనాగరిక జీవితం, ఎందుకంటే..
ఇనుప కడ్డీతో తలపై మోదీ హత్యలు: పోలీసులు అతడిని హత్యలు జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రమణ్ హత్యలు చేసిన విధానాన్ని పోలీసులకు వివరించాడు. ఒంటరిగా కనిపించే వ్యక్తులను, జంతువులను ఇనుప కడ్డీతో కొట్టి చంపేవాడినని రమణ్ తెలిపాడు. అనంతరం హత్యలకు ఉపయోగించిన ఇనుప రాడ్డును దాచి పెట్టిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించాడు. హత్యలు చేయడానికి చాలా చిత్రమైన కారణాలు చెప్పాడు. ‘‘ఈ ప్రపంచం ‘చట్టం’ చుట్టూ తిరుగుతుంది. కానీ నా ప్రపంచమే వేరు. నేను ఒక శక్తిని’’ అని పేర్కొన్నాడు. కోర్టులో రమణ్ తరఫు న్యాయవాది.. అతడికి మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్లే హత్యలు చేసినట్లు తెలిపారు.
Also Read: ఓ మై గాడ్.. ‘కోకా కోలా’ రంగులో సరస్సు, అలా ఎందుకు మారిందంటే..
కొన్ని సందేహాలు అలాగే మిగిలిపోయాయి: రమణ్ చేసిన హత్యలకు కోర్టు తొలుత మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రమణ్ 1995లో అనారోగ్యంతో చనిపోయాడు. కానీ, అతడి హత్యలు మాత్రం ఇప్పటికీ చర్చనీయంగానే ఉన్నాయి. రమణ్ ఈ హత్యలు ఎందుకు చేశాడనే విషయంపై స్పష్టత లేదు. అలాగే, 1966-1968 మధ్య హత్యలను ఎందుకు నిలిపాడనేది కూడా తెలియరాలేదు. ఆ నిజాలు రమణ్‌తోనే మట్టిలో కలిసిపోయాయి. రమణ్ హత్యలపై నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వెబ్‌సీరిస్‌ను కూడా విడుదల చేశారు.
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!