అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే ఏ జీవి అయినా జీవించగలదని మనకు తెలిసిందే. అయితే, అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ‘కడుపు’ నిండా ఆహారం తీసుకోవాలి. మరి.. ‘కడుపు’ లేకపోతే ఆహారమంతా ఎక్కడికి వెళ్తుంది? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? ఈ వ్యక్తి గురించి తెలుసుకుంటే మీరు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే ఇతడికి కడుపు లేదు, ప్రేగుల్లేవు. చివరికి పిత్తాశయం (Gallbladder) కూడా లేదు. అయినా సరే అతడు హాయిగా బతికేస్తున్నాడు.
ఔనండి నిజం! సాధారణంగా మనం తినే ఆహారం గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళ్తుంది. ఆ తర్వాత జీర్ణమై.. మిగతా శరీర భాగాలకు పోషకాలను అందిస్తుంది. అప్పుడే మన శరీరానికి శక్తి వస్తుంది. అయితే, స్పెయిన్‌లోని వాలెన్సియాలో నివసిస్తున్న జువాన్ డ్యూయల్ అనే 36 ఏళ్ల వ్యక్తి ఏకంగా కడుపు, పేగులు, పిత్తాశయం లేకుండా జీవిస్తున్నాడు. అవయవాలు కోల్పోయినా అతడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. అవేవీ లేకుండానే అతడు ఇప్పుడు గొప్ప మారథన్ రన్నర్‌గా పేరు సాధించాడు.
జువాన్‌కు 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ‘ఫ్యామిలియల్ మల్టిపుల్ పాలిపోసిస్’ అనే సమస్యతో బాధపడ్డాడు. వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న ఈ వ్యాధి వల్ల అతడి జీర్ణ వ్యవస్థ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలున్నాయని వైద్యులు తెలిపారు. జువాన్ అమ్మమ్మ కోలన్ ఆడేనొకసినోమా (Colon Adenocarcinoma) అనే సమస్యతో చనిపోయారు. ఆ తర్వాత అతడి తండ్రికి కూడా అదే సమస్య రావడంతో ఆయన పేగులకు సర్జరీ నిర్వహించారు. జువాన్‌కు 19 ఏళ్ల వయస్సు రాగానే మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వైద్యులు అతడి ప్రేగులు, పెద్దప్రేగు, పురీషనాళాన్ని తొలగించారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమే.
జువాన్‌కు 28 ఏళ్ల వయస్సు రాగానే అతడి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఆ వ్యాధి అతడి కడుపుకు కూడా సోకింది. దీంతో వైద్యులు కడుపును కూడా తొలగించారు. దీంతో అతడు దాదాపు చావును చూసి వచ్చాడు. 105 కిలోల బరువుండే అతడు.. కడుపును తొలగించడం వల్ల కొద్ది రోజుల్లోనే 57 కిలోలను కోల్పోయాడు. అయితే, సమస్య అంతటితో ఆగలేదు. అతడి పిత్తాశయాన్ని బ్యాక్టీరియా ఎటాక్ చేసింది. దీంతో వైద్యులు దాన్ని కూడా తొలగించారు. అలా అతడు కడుపు, పేగులు, పిత్తాశయాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత జువాన్ పరిస్థితి మరింత బాధకరంగా మారింది.
జువాన్‌ను ప్రాణాలతో ఉంచేందుకు వైద్యులు ఎన్నో సర్జరీలు చేశారు. ఫలితంగా జువాన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. అదే సమయంలో స్పెయిన్‌లో ఆర్థిక మాంధ్యం తలెత్తింది. దీంతో అక్కడ జీవించడమే కష్టంగా మారింది. శరీరంలో శక్తి లేకపోవడం వల్ల చాలా బలహీనంగా మారిపోయాడు అలాంటి సమయంలో అతడి స్నేహితులు జపాన్‌కు ఆహ్వానించారు. జపాన్ వెళ్లిన తర్వాత జువాన్ జీవితంలో ఊహించని మార్పు వచ్చింది. అయితే, జపాన్ మాట్లాడటం రాకపోవడం వల్ల ఎప్పుడూ ఓ కుక్కను పట్టుకుని నడిచేవాడు.
ఓ రోజు కుక్కను పట్టుకుని బయట నడుస్తున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కుక్క ఒక్కసారిగా అతడిని ముందుకు లాగడంతో పరుగు పెట్టాడు. అప్పటివరకు నడవడమే కష్టమనుకున్న జువాన్.. పరిగెట్టగలడనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత మళ్లీ అతడు వెనక్కి తిరిగి చూడలేదు. కొన్ని నెలల తర్వాత జువాన్ ఇంగ్లాండ్‌లోని ఓ పట్టణంలో పనిచేస్తూ కాలం వెళ్లదీశాడు. నిత్యం వ్యాయమం, వాకింగ్ చేస్తూ ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నించాడు.
మరి శరీరానికి శక్తి ఎలా?: కడుపు, పేగులు లేనప్పుడు అతడికి ఆహార ఎలా జీర్ణమయ్యేది? అతడికి శక్తి ఎలా వస్తుంది? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే. పెపా అనే న్యూట్రిషనిస్ట్ సూచనల ప్రకారం జువాన్ ఆహారాన్ని తీసుకొనేవాడు. తన శరీరం ఫిట్‌గా ఉంచుకోడానికి ప్రయత్నించేవాడు. సర్జరీ జరిగిన ఆరు నెలల్లోనే అతడు బర్సెలోనాలో జరిగిన హాఫ్ మారథన్‌ను రెండు గంటల్లోనే పూర్తి చేసి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత అతడు పర్వతాలను ఎక్కడం కూడా ప్రారంభించాడు.
శరీరానికి శక్తి అందేందుకు తాను కేవలం డోనట్స్, గమ్మీ బీర్స్, పాస్తా మాత్రమే తింటానని జువాన్ తెలిపాడు. ‘‘నాకు ఆహారం జీర్ణం కాదు. కానీ, నాకు శక్తి రావాలంటే రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అలా తినడం చాలా కష్టమైన పని. నేను ఎంత కష్టపడతానో అంత ఆహారాన్ని శరీరానికి అందించాల్సిందే’’ అని జువాన్ పేర్కొన్నాడు. చూశారుగా.. అంతర్గత అవయవాలు లేకపోయినా ఆత్మస్థైర్యంతో జువాన్ తన జీవితాన్ని చక్కదిద్దుకున్నాడు. ఇతడి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం కదూ.