IAC Vikrant: 


పూర్తి దేశీయంగా తయారైన ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్‌ IAC విక్రాంత్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ నేవీ సేవల్ని కొనియాడారు. "పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇంత భారీ స్థాయిలో ఎయిర్ క్రాఫ్ట్‌ క్యారియర్‌ తయారు చేసిన దేశాల్లో భారత్‌ కూడా సగర్వంగా నిలబడింది. ఇండియన్ నేవీకి ఈ క్యారియర్‌ కొత్త బలాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఇదో చరిత్రాత్మక దినం. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సహా ఇందుకోసం పని చేసిన ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు అందరికీ అభినందనలు" అని ప్రశంసించారు.  


కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. ఇండియన్ నేవీ చరిత్రలో ఇంత భారీ స్థాయి క్యారియర్ కమిషన్ కావడం ఇదే తొలిసారి. ఈ క్యారియర్ నిర్మాణం కోసం రూ.20 వేల కోట్లు వెచ్చించారు. దాదాపు 76% మేర దేశీయంగా తయారైంది. ఈ IAC విక్రాంత్‌ తయారు చేయడానికి స్ఫూర్తినిచ్చింది... INS విక్రాంత్. భారత్‌లో తొలి ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్‌గా రికార్డు సృష్టించింది INS విక్రాంత్. 1971 నాంటి ఇండో- పాక్‌ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఈ IAC విక్రాంత్‌ను అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇందులో టాప్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. 


1. ఇప్పటి వరకూ యూకే, యూఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ వద్ద దేశీయంగా తయారైన ఎయిర్‌ క్రాఫ్ట్‌లున్నాయి. ఇప్పుడు IACవిక్రాంత్‌ను నేవీలో కమిషన్ చేయడం ద్వారా ఈ జాబితాలో భారత్ కూడా చేరనుంది. 
 
2. పూర్తిగా దేశీయంగా తయారైన తొలి ఎయిర్‌ క్రాఫ్ట్ ఇదే. అంతే కాదు. భారత్‌లో తయారైన అతి పెద్ద షిప్ కూడా ఇదే. 


3. ఈ క్యారియర్ 262 మీటర్ల పొడవు ఉంటుంది. 62 మీటర్ల వెడల్పుతో భారీగా కనిపిస్తుంది. 28 Knots స్పీడ్‌తో దూసుకుపోతోంది. 45 వేల టన్నుల బరువుంటుంది. INS విక్రాంత్ కన్నా చాలా అడ్వాన్స్‌డ్ క్యారియర్ ఇది. 


4. ఇందులో 88 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు గ్యాస్ టర్బైన్లుంటాయి. మిగ్-29 K ఫైటర్ జెట్స్, కమోవ్ -31 (Kamov-31), MH-60R మల్టీరోల్ హెలికాప్టర్లను ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. 


5. IAC విక్రాంత్‌లో మొత్తం 2,300 కంపార్ట్‌మెంట్‌లుంటాయి. 1700 మంది సిబ్బంది పని చేస్తారు. వీటితో పాటు మహిళా ఆఫీసర్ల కోసంస్పెషలైజ్డ్ క్యాబిన్స్ ఉంటాయి. ఈ క్యారియర్‌లోని ఎక్విప్‌మెంట్, మెషినరీ అంతా దేశీయంగా తయారైనవే. 


6. దేశంలోనే భారీ ఇండస్ట్రియల్ హౌజ్‌లు వీటిని తయారు చేశాయి. మొత్తం 76% మేర దేశీయంగా తయారైన ఈ క్యారియర్.. "ఆత్మనిర్భర భారత్‌"కు సాక్ష్యమని నౌకాదళం స్పష్టం చేసింది. రెండు ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌ అంత వెడల్పున్న ఈ క్యారియర్‌ మొత్తం 8 కిలోమీటర్ల కారిడార్‌తో ఉంటుంది. 


7. 2009లో IAC విక్రాంత్ తయారీ మొదలైంది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రత్యేకంగా ఓ స్థలం కేటాయించి దీన్ని డిజైన్ చేశారు. ఇలాంటి వార్‌షిప్స్‌ను తయారు చేసుకునే సామర్థ్యం ఉన్న దేశాల్లో భారత్‌ కూడా సగర్వంగా నిలవనుంది. 


8. గత నెలలో చివరి విడత "సీ ట్రయల్స్‌" నిర్వహించారు. భారత్‌లో తొలి ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్‌గా పేరొందిన INS Vikrantకి గుర్తుగా...ఇప్పుడు తయారు చేసిన క్యారియర్‌కు ఆ పేరు (IAC Vikrant)పెట్టారు. 


Also Read: KCR National Politics : ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా "ఫ్రంట్" కట్టలేకపోతున్న కేసీఆర్ ! జాతీయ రాజకీయాల్లో వ్యూహాలు పని చేయడం లేదా ?