Naga Sadhu in Mahakumbh : ప్రస్తుతం చలి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇంకా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కొన్నిచోట్ల రోడ్లు కూడా మంచుతో నిండిపోతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళా 2025 ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సాధువులు తరలివస్తారు. అయితే ఈ వేడుకలో భాగంగా తొలి రోజు రాజస్నానం సాధువులకు ఎంతో ప్రత్యేకమైనది. దీన్ని వారు పవిత్రమైన ప్రక్రియగా భావిస్తారు.
సాధువులంటేనే సాధారణంగా వారి జీవన శైలి చిత్రంగా, కఠినంగా, అనేక రహస్యాలతో నిండి ఉంటుంది. బయటి ప్రపంచానికి వ్యతిరేకంగా, విలాసాలను, బంధాలను వదిలి ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగి తేలుతుంటారు. కేవలం కుంభమేళా లాంటి కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మహా కుంభమేళా నాగ సాధువుల రాజ స్నానంతో ప్రారంభమవుతుందని చెబుతుంటారు. అన్ని అఖారాలకు చెందిన నాగ సాధువులు డప్పు వాయిద్యాలతో వచ్చి పవిత్ర నదీ తీరమైన గంగా నది ఒడ్డున స్నానం చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎముకలు కూడా వణికిపోయే ఈ విపరీతమైన చలిలో మనం హీటర్లు, గీజర్లతో పెట్టుకుని స్నానం చేసినా చలి పెడుతూనే ఉంది. కానీ నాగ సాధువులకు అలాంటి ఏర్పాట్లేమీ ఉండవు. వారు నిత్యం నగ్నంగా ఉండి సాధన చేస్తారు. మరి వారికి చలి ఎందుకు అనిపించదు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? అన్న విషయాలు చాలా మందిని వెంటాడుతూ ఉంటాయి. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యోగా
యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని చాలామంది చెబుతూంటారు. మనసును నియంత్రించుకోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా యోగా పరిష్కారమని నమ్ముతుంటారు. అలాగే ఏ సన్యాసికైనా యోగా అనేది జీవితంలో అంతర్భాగంగా ఉంటుంది. యోగా ద్వారా వారు తమ శరీర శక్తిని పెంచుకుంటారు. వారి శరీరాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటారు. నాగ సాధువులు యోగ విద్యను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారానే దీన్ని సాధించగలుగుతారు.
కఠినమైన అభ్యాసం
కష్టపడి సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని అంటారు. సాధన ద్వారా మనం మనస్సుపై నియంత్రణను పొందవచ్చు. ఇది శారీరక సుఖం, దుఃఖాన్ని భరించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి నాగ సాధువులు కూడా ఈ తపస్సు, ధ్యానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తారు. మనస్సు, శరీరంపై నియంత్రణ పొందుతారు. దీని వల్ల వారికి చలి, వేడి అన్న భావన అంతగా తెలియదు.
శరీరంపై బూడిద
సాధారణంగా నాగ సాధువులు తమ శరీరంపై బూడిద పూసుకుని కనిపించడం చూసే ఉంటాం. పురామాలు, గ్రంథాల ప్రకారం, బూడిదను పవిత్రంగా భావిస్తారు. భస్మమే పరమ సత్యమని, శరీరం ఏదో ఒకరోజు బూడిదగా మారుతుందని అంటారు. భస్మం నెగెటివ్ ఎనర్జీ నుంచి కాపాడుతుందని నాగ సాధువులు నమ్ముతారు. అంతే కాకుండా బూడిదను శరీరంపై రుద్దడం వల్ల జలుబు రాదని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల అది రాసుకున్న వారికి చలి, వేడి కూడా అనిపించదు. వాస్తవానికి, ఇది ఒక విధంగా అవాహకం వలె పనిచేస్తుంది.