CM Chandrababu Key Orders To APSRTC: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చే వారితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, బస్టాండ్లు రద్దీగా మారాయి. అటు, హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వందల కొద్దీ వాహనాలతో ట్రాఫిక్ జాం నెలకొంది. గంటకు 900 వాహనాల వరకూ టోల్ ప్లాజాను దాటుతున్నట్లు తెలుస్తోంది. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటు, రద్దీ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కీలక సూచనలు చేశారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సులు తీసుకుని ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిట్ నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రద్దీ తీవ్రంగా ఉన్న మార్గాల్లో ఈ తరహా ఏర్పాట్లతో ప్రజలకు కొంతమేర ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పారు.
ఈ ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు బస్సులు, అవసరమైతే స్కూల్ బస్సులను ఉపయోగించుకొని, గ్రామాలు, పట్టణాలకు అదనపు ట్రిప్స్ నడిపి ప్రజలకు అసౌకర్యం లేకుండా చెయ్యాలని ఆదేశించారు. సొంతూరికి వెళ్లేందుకు ఏ ఒక్క ప్రయాణికుడు ఇబ్బంది పడకుండా చూడాలని అన్ని జిల్లాల ఆర్టీసీ ఆర్ఎంలకు నిర్దేశించారు.
కాగా, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా పండుగకు సొంతూళ్లకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం సహా పలు నగరాల్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది వస్తోన్న క్రమంలో ఎన్ని అదనపు బస్సులు, సర్వీసులు వేసినా అవి సరిపోవడం లేదు. ఆర్టీసీ పల్లెవెలుగు, సాధారణ సర్వీసులు నిరంతరం తిప్పుతున్నా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రత్యమ్నాయంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు.
హైవేపై భారీగా ట్రాఫిక్ జాం
అటు, పండుగకు సొంతూరికి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. సిబ్బంది హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తుండగా.. మరోవైపు ఏపీ వైపు వెళ్తున్న వారిని 10 టోల్‌బూత్‌ల ద్వారా పంపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాల చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆపై నార్కట్‌పల్లి దాటారంటే వీరికి ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయని తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. శనివారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్లు, ఎల్బీనగర్ జంక్షన్ ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.