Shami News: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు జనవరి 12 ను ఐసీసీ నిర్ణయించగా, బీసీసీఐ దీనిపై ఎక్స్ టెన్షన్ కోరే అవకాశం కనిపిస్తోంది. జట్టు కూర్పులో డైలామా నెలకొన్న పరిస్థితి ఉండటంతో టీమిండియా ఎంపికను కొన్ని రోజులపాటు వాయిదా వేసే అవకాశమున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ పేసర్, మహ్మద్ షమీ గాయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ హజారే వన్డే ట్రోఫీలో షమీ ఆడి, పూర్తి ఓవర్ల కోటా కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం అతని ఫిట్ నెస్ లెవల్ ను పరీక్షిస్తున్నారు. ఎన్సీఏలోని మెడికల్ టీమ్ నుంచి దీనిపై నివేదిక రాగానే దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. అయితే ఇందుకోసం మరో వారం నుంచి పది రోజుల వరకు పట్టే చాన్స్ ఉందని సమాచారం. వచ్చేనెల 19 నుంచి మెగాటోర్నీ పాకిస్థాన్ లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియా ఆడే మ్యాచ్ లు హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్ లో జరుగుతాయి.
నెలవరకు గడువున్నా..
నిజానికి ఈనెల 12న జట్టును ప్రకటించిన తర్వాత వచ్చేనెల 12 వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశముంది. అయితే బీసీసీఐ అందుకు సుముఖంగా లేదు. వారం రోజుల వ్యవధిలో స్క్వాడ్ ను పూర్తి స్ఘాయిలో స్టడీ చేసి, ప్రకటించాలని చూస్తోంది. ఆ తర్వాత మార్పులు చేర్పులకు ఆస్కారం లేకుండా మెగాటోర్నీపై నజర్ పెట్టాలని భావిస్తోంది. ఇక షమీ.. సొంతగడ్డపై 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. చీలమండ గాయంతో తను దాదాపు ఏడాదిన్నర జట్టుకు దూరం అయ్యాడు. మధ్యలో కోలుకుని దేశవాళీలు అడినప్పటికీ, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేంత ఫిట్నెస్ లేదని జట్టు యాజమాన్యం అతడిని టీమ్ లోకి తీసుకోలేదు. మెగాటోర్నీలో అనుభవం కలిగిన షమీ లాంటి వాళ్ల అవసరం ఉండటంటో అతడిని ఎలాగైనా జట్టులోకి తీసుకునే అవకాశాల కోసం చూస్తోంది.
టోర్నీ షెడ్యూల్లో హైడ్రామా..
నిజానికి పాక్ లో టోర్నీ షెడ్యూల్ ప్రకటించడానికి ముందు చాలా తతంగం నడిచింది. భద్రతా కారణాలతో పాక్ లో పర్యటించేందుకు భారత జట్టు ససేమిరా అనడంతో హైబ్రిడ్ పద్ధతితో దుబాయ్ లో టీమిండియా మ్యాచ్ లు నిర్వహించనున్నారు. వచ్చేనెల 20 నుంచి మెగాటోర్నీలో భారత్ తన వేట ప్రారంభిస్తుంది. అదే రోజు బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాక్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆ తర్వాత మార్చి తొలి వారంలో న్యూజిలాండ్ తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ భారత్ కనుక నాకౌట్ దశ అంటే సెమీఫైనల్, ఫైనల్ కు అర్హత సాధిస్తే, ఈ మ్యాచ్ లను దుబాయ్ లోనే నిర్వహిస్తారు. ఇక భారత్ లోనూ తమ జట్టు పర్యటించదని పాక్ కుండబద్దలు కొట్టింది. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలో భాగంగా భారత్ లో జరిగే మ్యాచ్ లను తాము కూడా తటస్థ వేదికపై ఆడతామని ఐసీసీ నుంచి హామీని పీసీబీ తీసుకుంది. 2017లో చివరి సారిగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ను ఫైనల్లో ఓడించి పాక్ విజేతగా నిలిచింది.