CM Chandrababu Key Comments On Green Energy And Investments: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. శనివారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrozen) ఉత్పత్తి కానుందని.. దీంతో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని తెలిపారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని.. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వాటికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉంటుందని చెప్పారు. 'గ్రీన్ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ టేకోవర్ చేయనుంది. ఇక్కడ గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ప్లాంట్‌పై రూ.25 వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోంది. ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. బయోగ్యాస్‌కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఇది తయారవుతుంది. గడ్డి పెంచడానికి ఎకరాకు రూ.30 వేలు కౌలు రైతులకు రిలయన్స్ చెల్లించనుంది.


బెంగుళూరు సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్‌ను కుప్పానికి తెచ్చింది. సూర్యఘర్ పథకం అమల్లో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్ బ్యాటరీల ఛార్జింగ్‌కు డబ్బు చెల్లిస్తారు. దీంతో వారికి అదనపు ఆదాయం సమకూరనుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిపై నూతన ఆలోచనలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం ఉచితంగా సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నాం.' అని సీఎం పేర్కొన్నారు.


Also Read: Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి


సంక్రాంతి శుభాకాంక్షలు


అటు, తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. పండుగ సమయంలో ఊరెళ్లి అందరితో సంతోషంగా గడపాలని.. అందుకే తాను ప్రతీ సంక్రాంతికి ఊరెళ్తానని అన్నారు. 'పండుగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవడం అలవాటు చేసుకోవాలి. అందుకే నేను ప్రతీ సంక్రాంతికి మా ఊరికి వెళ్తాను. ఈ సంప్రదాయానికి భువనేశ్వరే కారణం. 25 ఏళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలుపెట్టిన ఈ సంప్రదాయం క్రమం తప్పకుండా పాటిస్తున్నాం. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో అంతా ఓసారి కలిసి మాట్లాడుకోవడం ఎంతో అవసరం. మనం ఆనందంగా పండుగ చేసుకునేటప్పుడు ఊరిలోని పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ విధానం ప్రోత్సహించేందుకు పీ4 కాన్సెప్ట్ పేపర్‌ను ఆదివారం విడుదల చేస్తున్నాం. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చించాకే అమల్లోకి తీసుకొస్తాం. పీ4 విధానం బాగా చేసిన వారికి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తాం.' అని తెలిపారు.


Also Read: Hyderabad Vijayawada Highway: సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు