Massive Traffic Jam on Hyderabad-Vijayawada Highway | హైదరాబాద్: ప్రతి ఏడాదిలాగే ఈ సంక్రాంతికి నగరం నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. పండుగకు సొంతూరికి వెళ్తున్న ప్రయాణికులతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. సిబ్బంది హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తుండగా.. మరోవైపు ఏపీ వైపు వెళ్తున్న వారిని 10 టోల్‌బూత్‌ల ద్వారా పంపిస్తున్నారు.
రెండు రోజులు ట్రాఫిక్ జామ్
ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిలో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా నేడు, ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతాయి. శనివారం తెల్లవారుజాము నుంచే నగరంలోని ఎంజీబీస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ జంక్షన్ ప్రయాణికులతో రద్దీగా మారాయి. పోలీసులు వాహనాల రద్దీ కారణంగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. నేటి సాయంత్రం, ఆదివారం భారీగా ట్రాఫిక్ జామ్ తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులు అప్రమత్తమై ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని, తగిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.