8 Years Old Child Died Due To Heart Stroke In Ahmadabad: ఆ చిన్నారి ఎప్పటిలానే సరదాగా స్కూలుకు వెళ్లింది. తన తరగతి గదికి వెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న బెంచీపై తీవ్ర అస్వస్థతతో కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్‌లోని (Ahmadabad) జీబార్ స్కూల్‌లో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి మూడో తరగతి చదువుతోంది. రోజూలాగానే శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన చిన్నారి.. తన తరగతి గదిలోకి వెళ్తూ నడుస్తూనే తీవ్ర అస్వస్థతకు గురై అక్కడ బెంచీలో కుప్పకూలిపోయింది. దీన్ని గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే చిన్నారికి సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అటు, బిడ్డ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందించారు. 'ఆ చిన్నారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. శుక్రవారం ఉదయం ఆ పాప కుర్చీలో కూర్చుని ప్రాణాలు విడిచింది. చిన్నారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాం. పాప తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నారు. ఆమె తన గ్రాండ్ పేరేంట్స్‌తో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటోంది.' అని తెలిపారు.