Magunta MP :  ఢిల్లీలో జరిగినట్లుగా చెబుతున్న లిక్కర్ పాలసీ స్కాంలో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో రాజకీయ విమర్శలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ కేసు విషయంలో ఈడీ వరుసగా సోదాలు నిర్వహిస్తోంది. గతంలో ఓ సారి సోదాలు చేసింది. తాజాగా శుక్రవారం మరోసారి సపలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట ఇళ్లు, కార్యాలయాలు కూడా ఉన్నాయి. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీతో మాగంట కు ఏం సంబంధం ? అసలెక్కడ ఆయన ఇరుక్కున్నారు ? వాటిపై పూర్తి డీటైల్స్ ఇవిగో. 


లిక్కర్ తయారీ బిజినెస్‌లో ప్రసిద్ధులు మాగుంట కుటుంబం !
   


ఒంగోలు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి పలు డిస్టిలరీస్ ఉన్నాయి.  35కిపైగా కంపెనీల్లో  ఆయన భాగస్వామి. వాటిలో మద్యం తయారు కంపెనీలుఎక్కువ.  ప్రముఖ బ్రాండ్ల మద్యం తయారీలో మాగుంట కుటుంబానికి పేరుంది. చెన్నై కేంద్రంగా ఆయన వ్యాపారాలు ఎక్కువగా సాగుతూ ఉంటాయి. శ్రీనివాసుల రెడ్డి వారసుడిగా ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి కూడా ఈ వ్యాపార వ్యవహారాల్లో భాగస్వామిగా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఆరు కంపెనీల్లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. ఆ క్రమంలోనే దిల్లీ మద్యం టెండర్లలో ఇతరులతో కలిసి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సంబంధించిన వారి కంపెనీలు కూడా టెండర్లు దాఖలు చేయడం, అవి ఖరారు కావడంతో ఢిల్లీ మద్యం విక్రయాల్లో ఒంగోలు ఎంపీ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి.


చట్టబద్ధంగానే కాంట్రాక్టులు టెండర్లు దక్కాయన్న మాగుంట ! 


నిషేదిత జాబితాలో ఉన్న  ఖావో గాలి అనే సంస్థ వైసీపీ ఎంపీ మాగుంటకు చెందిన కంపెనీతో కలసి సిండికేటుగా ఏర్పడిందని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొన్ని లిక్కర్ సంస్థలకు లాభం కల్గిందని కమలనాధులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ లిస్టులో ఒక్క కంపెనీ టెండర్లలో పాల్గొనడమే తప్పు అయితే.. ఆ సంస్థ మరో కంపెనీతో సిండికేట్ కావడం ఏంటని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. అయితే  "మాగుంట అగ్రోఫామ్స్ పేరుతో ఉన్న కంపెనీకి బిడ్డింగ్‌లో టెండర్ దక్కింది. అన్నీ సక్రమంగా జరిగాయి. అవకతవకలు జరిగాయన్నది వాస్తవం కాదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెబుతున్నారు.  



లిక్కర్ స్కాంలో వినిపిస్తున్న అరబిందో శరత్ చంద్రారెడ్డి పేరు !


ఖావో గాలి అనే సంస్థ తో కలిసి మాగుంట కంపెనీైలు టెండర్లు దక్కించుకున్నాయి. అయితే ఈ కంపెనీలకు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది హైదరాబాద్‌కు చెందిన అరబిందో గ్రూప్ అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. శరత్ చంద్రారెడ్డి ..  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు. ఈ కారణంగా ఏపీలో ఈ అంశంపై రాజకీయ దుమారం కూడా రేగుతోంది.  ముందు ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపే అవకాశం ఉంది. 


ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ - హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు