Indias GDP Growth: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ, అమెరికాకు చెందిన ఫిచ్ (Fitch), 2022-23 ఆర్థిక సంవత్సరానికి (FY23) భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను బాగా తగ్గించింది. భారత వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో అంచనా కట్టిన ఫిచ్, తాజాగా ఆ లెక్కను ఏకంగా 0.8 శాతం తగ్గించి, 7శాతానికి కుదించింది.
స్థూల జాతీయోత్పత్తి (GDP) ఆధారంగా ఫిచ్ ఈ అంచనాలు వేసింది. GDP వృద్ధిలో వేగం తగ్గుతుందని ఫిచ్ చెబుతోంది. FY24లో (2023-24) GDP వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని గతంలో లెక్కేసిన ఫిచ్, తాజాగా తన అంచనాను సవరించింది, 6.7 శాతంగా ఉండవచ్చని చెబుతోంది.
Q1FY22లో (FY22 ఏప్రిల్-జూన్ త్రైమాసికం) 13.5 శాతం (y-o-y) వృద్ధితో భారత ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుందని, అయితే, జూన్‌లో తాము వేసిన అంచనా 18.5 శాతం పెరుగుదల కంటే తక్కువగా ఉందని ఫిచ్ వెల్లడించింది. సీక్వెన్షియల్‌గానూ (q-o-q) 3.3 శాతం క్షీణత కనిపించిందని తెలిపింది. భారత్ బలంగా పుంజుకుంటున్నా; ప్రపంచ ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం, పెరిగిన ద్రవ్యోల్బణం, కఠినమైన ద్రవ్య విధానం కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని భావిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది.
వడ్డీ రేట్ల పెంపు
వడ్డీ రేట్ల పెంపును ప్రధానంగా ప్రస్తావించిన ఫిచ్, ఈ సంవత్సరాంతం కంటే ముందే వడ్డీ రేట్లను (రెపో రేటు) 5.9 శాతానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెంచుతుందని అభిప్రాయపడింది. కాబట్టి సమీప భవిష్యత్తులో పాలసీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని, వచ్చే ఏడాది మొత్తం 6 శాతంగా కొనసాగుతాయని రేటింగ్ ఏజెన్సీ ఆశిస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఆర్థిక వృద్ధి రేటు అంచనాను 7.4 శాతం నుంచి 6.7 శాతానికి ఫిచ్ తగ్గించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7.1 శాతంగా నమోదు కావచ్చని చెబుతోంది.
ఈ ఏడాది (2022 క్యాలెండర్ ఇయర్) చివరికి, రూపాయితో పోలిస్తే డాలరు విలువ రూ.79 వద్ద కొనసాగొచ్చని; 2023లో రూ.80; 2024లోనూ రూ.80కు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది.
రిటైల్ ద్రవ్యోల్బణం
రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది (2022 క్యాలెండర్ ఇయర్‌లో) సగటు 6.2 శాతంగా నమోదు కావచ్చని లెక్కలు గట్టిన ఫిచ్, 2023లో సగటున 5 శాతంగా; 2024లోనూ 5 శాతంగా ఉండవచ్చని లెక్కగట్టింది.
ప్రపంచ వృద్ధి
ప్రపంచ జీడీపీ 2022లో 2.4 శాతం పెరుగుతుందని ఫిచ్ అంచనా వేసింది. అయితే, జూన్‌లోని అంచనా కంటే 0.5 శాతం పాయింట్లు (ppt) తగ్గించింది. 2023లో కేవలం 1.7 శాతంగా నమోదవుతుందని చెప్పింది. గత అంచనా కంటే 1 శాతం కోత పెట్టింది.
యూరప్, అమెరికా
యూరోజోన్, యునైటెడ్ కింగ్‌డమ్ గురించి ప్రస్తావించిన గ్లోబర్ రేటింగ్ ఏజెన్సీ, ఈ ఏడాది చివర్లో మాంద్యంలోకి ప్రవేశిస్తుందని, 2023 మధ్యకాలంలో అమెరికా స్వల్ప మాంద్యాన్ని ఎదుర్కొంటుందని అంచనా వేసింది.
యూరప్, అమెరికాలో ప్రస్తుతమున్న చమురు సంక్షోభాన్ని ప్రధానంగా లెక్కలోకి తీసుకుని, గత వృద్ధి అంచనాల్లో భారీగా కోతలు పెట్టింది. అమెరికా వృద్ధి 2022లో 1.7 శాతానికి, 2023లో 0.5 శాతానికి తగ్గించింది. వరుసగా 1.2 శాతం, 1 శాతం కోతలు పెట్టింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో, యూరో జోన్ వృద్ధిని 2.9 శాతంగా, యూకే వృద్ధిని 3.4 శాతంగా నమోదవుతాయని ఫిచ్ లెక్క వేసింది.