Himachal Pradesh Election Results 2022:


గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్..


గుజరాత్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ రెండోస్థానంలో ఉండగా...ఆప్ మూడో స్థానానికి పరిమితమైంది. అటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా సాగుతున్నాయి. కాంగ్రెస్ కాస్త లీడ్‌లోనే ఉంది. "ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమే" అని కాంగ్రెస్ నేతలు బయటకు ధీమాగా చెబుతున్నా...లోలోపల మాత్రం కలవర పడుతున్నారు. ఇందుకు కారణంగా...బీజేపీ అప్పుడే "మంతనాలు" మొదలు పెట్టడం. రెబల్ అభ్యర్థులతో సహా...పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎర వేసి తమ వైపు లాక్కునేందుకు చూస్తోందన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ఇతర రాష్ట్రాల్లో ఎలాగైతే "ఆపరేషన్ లోటస్‌"తో గెలిచిన ఎమ్మెల్యేలకు ఎర వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో...హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే విధంగా చేస్తుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. అందుకే...ముందస్తు జాగ్రత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను రాజస్థాన్‌లోని రిసార్ట్‌కు తరలిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం..ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్, సీనియర్ నేత భూపేంద్ర సింగ్ హుడా ఈ బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తోంది. వీళ్లు మాత్రమే కాదు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా హిమాచల్‌లోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏం చేయొచ్చనే ఆలోచనలో పడ్డారు. షిమ్లా వేదికగా వ్యూహ రచన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే...ప్రస్తుత ట్రెండ్‌ ప్రకారం కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ...సాయంత్రానికి మాత్రం ఫలితాల్లో స్పష్టత రాదు. ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతేనే...రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. బీజేపీ ఆపరేషన్ లోటస్‌ను తప్పకుండా మొదలు పెడుతుంది. అప్పుడు కాంగ్రెస్‌ బాధిత పక్షంగానే మిగిలిపోతుంది తప్ప...అన్ని స్థానాల్లో గెలిచి కూడా ఏ ఉపయోగం ఉండదు. అందుకే..ముందస్తు జాగ్రత్త పడుతోంది ఆ పార్టీ. 


గుజరాత్‌లో బీజేపీ లీడ్..


హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒక దశలో, గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కేంద్రాల చుట్టూ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. గుజరాత్లోని 37 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా... బీజేపీ దూసుకెళ్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపులో బీజేపీకి ఆధిక్యం లభించింది. 182 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీ మార్కు 92. ఈసారి ఓటింగ్ శాతం 2012 కంటే తక్కువగా ఉంది. 2017లో గుజరాత్‌లో 68.39 శాతం పోలింగ్ జరగ్గా, ఈసారి 64.33 శాతం పోలింగ్ నమోదైంది. 
ద్రవ్యోల్బణం, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత లేకపోవడం, పెద్ద ప్రాజెక్టులకు భూసేకరణ, రైతుల సమస్యలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇషుదన్ గధ్వీ, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ సహా 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ రోజు తేలనుంది. 


Also Read: Gujarat Results 2022: గుజరాత్‌లో కాషాయ రెపరెపలు- అప్పుడే ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్!