Hijab Ban Row: హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషన్లపై విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని, సాగదీత వద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఒక దశలో తాము సహనం కోల్పోతున్నామని ధర్మాసనం తెలిపింది.
గత తొమ్మిది రోజులుగా సుప్రీం బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వింటూనే ఉంది. అయితే.. బుధవారం పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులను ఉద్దేశించి మందలింపు వ్యాఖ్యలు చేసింది జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా ధర్మాసనం.
తీర్పు రిజర్వ్
విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీం కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
వాడీవేడి వాదనలు
హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టులో అంతకుముందు కూడా వాడివేడి వాదనలు జరిగాయి. ఇస్లాంలో నమాజ్ తప్పనిసరి కానప్పుడు, హిజాబ్ ఎందుకు కంపల్సరీ అని ముస్లిం పక్షాన్ని సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది.
అంతకుముందు
ఇస్లాంలోని ఐదు సిద్ధాంతాలను పాటించమని ఇస్లాంలో బలవంతం చేయలేదని వాదనల సందర్భంగా పిటిషనర్ ఫాత్మా బుష్రా తరఫు న్యాయవాది మహ్మద్ నిజాముద్దీన్ పాషా అంతకుముందు అన్నారు. దీంతో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియా ధర్మాసనం ఈ మేరకు ప్రశ్నించింది.
కచ్చితమా?
" ఇస్లాంలోని ఐదు ప్రధాన ఆచారాలు లేదా సిద్ధాంతాలను తప్పనిసరిగా పాటించాలని లేనప్పుడు హిజాబ్‌ను మాత్రం ముస్లిం మహిళలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని ఎలా అంటారు? అందులోనూ విద్యాసంస్థల్లో కూడా దీనిని కచ్చితంగా ధరించాలని ఎలా చెబుతారు? "
సుప్రీం ప్రశ్నకు బదులిస్తూ.. యావత్ ప్రపంచం కంటే మహిళలకు తన ముసుగే ముఖ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పినట్లు పాషా అన్నారు.
" ప్రవక్త మాటలను అనుసరించండి అని ఖురాన్ చెప్పినప్పుడు.. ఒక ముస్లిం అమ్మాయి బయటకు వెళ్లేటప్పుడు హిజాబ్ ధరించాలని నమ్ముతున్నప్పుడు, మతం ప్రాతిపదికన విద్యా సంస్థల్లోకి ముస్లిం బాలికలను అనుమతించకుండా నిషేధించవచ్చా? సిక్కు విద్యార్థులు పాఠశాలలకు పట్కా లేదా తలపాగా ధరించినప్పుడు, హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినులను విద్యా సంస్థల్లోకి ప్రవేశించకుండా నిషేధించడం అంటే ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కదా. "